కబ్జాల కూల్చివేతల్లో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

కబ్జాల కూల్చివేతల్లో ఉద్రిక్తత

Jul 22 2026 1:29 AM | Updated on Jul 22 2026 1:29 AM

శివాజీనగర: బెంగళూరు నగరవ్యాప్తంగా ఫుట్‌పాత్‌ ఆక్రమణలను జీబీఏ, పాలికేల అధికారులు జేసీబీలతో తొలగిస్తున్న ప్రక్రియ శివాజీనగర నియోజకవర్గంలో హింసకు దారితీసింది. దుకాణదారులు పాలికే ఇంజనీర్లు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. సిబ్బంది, అధికారులపై హెల్మెట్‌, బకెట్లు వంటివి విసరడంతో పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో శివాజీనగరలో ఉద్రిక్తత ఏర్పడి, వందలాదిగా పోలీసులను మోహరించారు.

ముఖాలపై పెప్పర్‌ స్ప్రే కొట్టి..

మంగళవారం శివాజీనగరలో ఫుట్‌పాత్‌ కబ్జాలను పాలికే అధికారులు కూల్చివేస్తున్నారు. షెడ్లు, అంగళ్లను తొలగిస్తు ఉండగా కొందరు జనం గుంపుగా ఏర్పడి జీబీఏ ఏఈలు మాధవరావు, అభియా గౌతమ్‌ను చుట్టుముట్టి గొడవకు దిగారు. వారిని హెల్మెట్లతో కొట్టారు. మహిళా ఇంజనీర్‌ రుచిత ముఖంపై పెప్పర్‌ స్ప్రే చల్లడంతో ఆమె అస్వస్థతకు గురైంది. జేసీబీ డ్రైవర్‌పై దాడికి దిగారు. దీంతో అరుపులు, కేకలతో గందరగోళం ఏర్పడింది. అధికారులు కమర్షియల్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. గొడవలతో కొంతసేపు కూల్చివేత పనులు నిలిచిపోయాయి. మళ్లీ పోలీసు బందోబస్తు మధ్య దుకాణాల ముందు భాగాలను, ఆక్రమిత ప్రాంతాలను కూల్చివేయించారు.

శాంతి భద్రతలు ఏవీ: బీజేపీ

అధికారులపై ఘోరమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ పక్ష నేత ఆర్‌.అశోక్‌ చెప్పారు. శాంతిభద్రతల పరిస్థితి ఎంతగా దిగజారిందో చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి కృష్ణభైరేగౌడ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు?, ఓటు బ్యాంకు రాజకీయాలే మీకు ముఖ్యం అని దుయ్యబట్టారు.

వారు విద్రోహ శక్తులు: మంత్రి

శివాజీనగర: జీబీఏ సిబ్బందిపై దాడిని ఖండిస్తున్నట్లు మంత్రి కృష్ణబైరేగౌడ తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారు పేదవారు కాదని, సంఘ విద్రోహ శక్తులేనని ఆయన అన్నారు. చట్ట ప్రకారం పనిచేసే అధికారులకు అండగా ఉంటామని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు.

పాలికే అధికారులపై దుకాణదారుల దాడులు

బెంగళూరు శివాజీనగరలో ఉద్రిక్తత

పలువురు సిబ్బందికి గాయాలు

10 మంది నిందితుల అరెస్టు

సిబ్బందికి పరామర్శ

బనశంకరి: దాడిలో గాయపడి బౌరింగ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అసిస్టెంట్‌ ఇంజనీర్లు మాధవరావ్‌, సావిత్రి, ఇంజనీర్‌ రుచిత, జేసీబీ డ్రైవర్‌ సిద్దప్ప, ట్రాక్టర్‌ సిబ్బంది సునీల్‌ను జీబీఏ కమిషనర్‌ మహేశ్వర్‌రావ్‌, ఇతర కమిషనర్లు పరామర్శించారు.

10 మంది అరెస్టు

బనశంకరి: జీబీఏ అధికారులపై దాడికి పాల్పడిన 10 మందిని కమర్షియల్‌ స్ట్రీట్‌ పోలీసులు అరెస్ట్‌చేశారు. కిరణ్‌, బసవరాజ్‌, రంజిత్‌, రంగస్వామి, ముజాహిద్‌ అహ్మద్‌, కొట్రేశ్‌, పరశురామ్‌, రఘు, పార్తీబన్‌, భరత్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దాడి దృశ్యాలు వీడియోలలో నిక్షిప్తమైనట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement