లోకాయుక్త వలలో అధికారిణి | - | Sakshi
Sakshi News home page

లోకాయుక్త వలలో అధికారిణి

Jul 22 2026 1:29 AM | Updated on Jul 22 2026 1:29 AM

హొసపేటె: విజయనగర జిల్లాలోని హూవినహడగలి తహసీల్దార్‌ కార్యాలయ భూ కేంద్రంలో గ్రామ నిర్వాహకురాలిగా పని చేస్తున్న షహనాజ్‌ బేగంను ఒక రైతు భూమి హక్కు పత్రాన్ని సవరించడానికి అతని నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు అరెస్ట్‌ చేశారు. తాలూకాలోని హొళగుంది గ్రామానికి చెందిన సర్వే నెంబర్‌–759 లో 1.62 ఎకరాల భూమి రైతు ఆధీనంలో ఉంది. తన తండ్రి పేరును కొట్రేశప్పగా మార్చాలని కోరుతూ 2025 ఏప్రిల్‌ 2న భూ కేంద్రంలో ఒక దరఖాస్తు ఇచ్చారు. అతను పని నిమిత్తం చాలా సార్లు కార్యాలయానికి వెళ్లాడు. ఆ పని పూర్తి కావాలంటే రూ.10 వేల లంచం ఇవ్వాలని గ్రామ నిర్వాహకురాలు షహనాజ్‌ బేగం డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై సిద్దలింగస్వామి లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పక్కా ప్రణాళికతో ఫిర్యాదుదారుడి నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు సోమవారం దాడి చేసి షహనాజ్‌ బేగంను లంచం సొమ్ముతో సహా అరెస్టు చేశారు. విజయనగర లోకాయుక్త డీఎస్పీ సచిన్‌ చలవాది నేతృత్వంలో లోకాయుక్త ఇన్‌స్పెక్టర్లు రాజేష్‌ లమాణి, అమరేష్‌ హుబ్బళ్లి ఆధ్వర్యంలో లోకాయుక్త అధికారులు, సిబ్బంది దాడిలో పాల్గొన్నారు.

పంటనష్టం పరిశీలన

హొసపేటె: విజయనగర జిల్లాధికారిణి కవిత మన్నికేరి మంగళవారం జిల్లాలోని వివిధ తాలూకాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. ఉదయం 9.30 గంటలకు హొసపేటె నుంచి బయలుదేరి నందిబండి, హంపాపట్టణ, మదిరె గ్రామాలకు చేరుకుని మొక్కజొన్న, హైబ్రీడ్‌ జొన్న ఇతర పంటలను పరిశీలించి, రైతులతో చర్చించారు. తాలూకాలో వర్షాలు లేక పోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. కొందరు రైతులు విత్తనాలు వేయకుండా విత్తనాలు, ఎరువులను ఇళ్లలోనే నిల్వ ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం కరువును ప్రకటించి, పంట సర్వే చేపట్టింది. జిల్లాధికారిణి పర్యటన సందర్భంగా రైతులు తమ దుస్థితిని ఏకరువు పెట్టారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. మేం అప్పులు చేసి, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశాం. వర్షాలు పడక పోగా పంట సాగు చేయ లేని దుస్థితి తలెత్తింది. తమకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. సీఈఓ అక్రమ్‌ పాషా, వ్యవసాయ శాఖ జేడీ మంజునాథ్‌, డీడీఏ వామదేవ్‌, తహసీల్దార్‌ ఆర్‌.కవిత, టీపీ ఈఓ పీ.విశ్వనాథ్‌, వ్యవసాయ అధికారి ఎస్‌.వీ.పాటిల్‌, బోస నాయక్‌, శశికుమార్‌, చేతన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎడమ కాలువకు

తాగునీరు విడుదల

రాయచూరు రూరల్‌: తుంగభద్ర ఎడమ కాలువకు తాగునీటిని విడుదల చేయడంతో జిల్లాధికారిణి పూవిత సోమవారం నీటిపారుదల శాఖాధికారులతో కలిసి పర్యటించి పరిశీలించారు. గణేకల్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, నాగడదిన్ని, అత్తనూరు, సిరవార కాలువలను ఆమె తనిఖీ చేశారు. డ్యాం నుంచి విడుదల చేసిన నీరు కేవలం తాగునీటి అవసరాల కోసమే తప్ప పంటలను సాగు చేసుకోవడానికి కాదన్నారు. ఉప కాలువల గేట్లు తెరవరాదని అధికారులకు సూచించారు.

వర్షాభావంపై జిల్లాధికారి సమీక్ష

బళ్లారిఅర్బన్‌: జిల్లాలో నైరుతి రుతుపవనాలు బలహీన పడటంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులపై జిల్లాధికారి కే.నాగేంద్ర ప్రసాద్‌ మంగళవారం రైతులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వారి సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయని, పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందన్నారు. నీటి కొరత నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ శాఖ సూచనలు జారీ చేసిందన్నారు. రైతులు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని సూచించారు. తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, అవసరమైన చర్యలు చేపడుతున్నామని జిల్లాధికారి తెలిపారు.

హెచ్‌ఎల్‌సీలో

వ్యక్తి మృతదేహం

హొసపేటె: నగరంలోని సండూరు రోడ్డులోని తుంగభద్ర హెచ్‌ఎల్‌సీ కాలువలో మంగళవారం ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. హెచ్‌ఎల్‌సీ కాలువలో సిబ్బంది కాలువను శుభ్రం చేస్తుండగా ఈ మృతదేహం లభించింది. మృతుని పేరు, చిరునామా తెలియరాలేదు. మృతుడు సహజ కారణాలతో మరణించాడా, హత్యకు గురయ్యాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయాన్ని దర్యాప్తులో ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఈ విషయంలో ఎక్సటెన్షన్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్పీ ఎస్‌.జాహ్నవి, డీఎస్పీ పీ.మురళీధర్‌ ఘటన స్థలాన్ని సందర్శించారు. విషయం తెలిసిన వెంటనే మృతదేహాన్ని చూసేందుకు సండూరు రోడ్డులోని హెచ్‌ఎల్‌సీ కెనాల్‌ బ్రిడ్జిపైకి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో కొంతసేపు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement