పుష్పరూపాల్లో గంగరాజుల వైభవం | - | Sakshi
Sakshi News home page

పుష్పరూపాల్లో గంగరాజుల వైభవం

Jul 22 2026 1:29 AM | Updated on Jul 22 2026 1:29 AM

బనశంకరి: స్వాంతంత్య్ర దినోత్సవం వస్తోందంటే బెంగళూరులోని ప్రసిద్ధ లాల్‌బాగ్‌ ఉద్యానవనంలో జరిగే ఫల పుష్ప ప్రదర్శన కోసం నగరవాసులు ఎదురుచూస్తారు. ఈ పంద్రాగస్టుకు జరిగే 220వ ఫ్లవర్‌ షోలో థీమ్‌ ఖరారైంది. కర్ణాటక మొదటి రాజవంశం, దీర్ఘకాలం పాలించిన గంగ వంశ రాజుల సామ్రాజ్య వైభవం పుష్ప థీమ్‌ సందర్శకులను ఆకట్టుకోబోతోంది. ఉద్యానవనశాఖ గ్లాస్‌హౌస్‌లో ఏర్పాట్లు ప్రారంభించింది. ఆగష్టు 6వ తేదీ నుంచి ఈ ప్రదర్శన ప్రారంభమవుతుంది.

గంగరాజుల ప్రగతి బాట

గంగవంశరాజులు కన్నడనాట ప్రసిద్ధ పాలకులుగా పేరుపొందారు. దక్షిణ భాగంలో కావేరి నది పరిసరాల్లో రాజ్యం స్దాపించి దీర్ఘకాలం పాలించిన తలకాడు గంగరాజులు అనేక రంగాల్లో అభివృద్ధికి పునాదులు వేశారు. క్రీశ 325 నుంచి 999 వరకు అంటే సుమారు 675 ఏళ్లు పాటు గంగరాజులు పరిపాలించారు. రమణీయ శైలిలో అనేక ఆలయాలను నిర్మించారు. గజశాస్త్రం ద్వారా ఏనుగులను మచ్చిక చేసుకున్నారు. తలకాడు, మాన్యపుర(మణ్ణి), కోలారు, శ్రావణ బెళగోళ మొదలైన చోట్ల విద్యాసంస్థలను ఏర్పాటుచేశారు. నదుల్లో పారే నీటిని పొలాలకు మళ్లించి నీటిపారుదలలో ప్రగతి సాధించారు. కావేరి నది మీద అనేకచోట్ల ఆనకట్టలు నిర్మించి కాలువలు ద్వారా సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు వేలాది చెరువులను నిర్మించారు.

మూడు ప్రధాన కట్టడాలతో..

గంగరాజులు 1300 ఏళ్ల కిందట నిర్మించిన తలకాడు సోమనాథేశ్వర ఆలయం, బెంగళూరులోని బేగూరులో పురాతన నాగనాథేశ్వర దేవస్థానం నమూనా, శ్రావణ బెళగొళ బాహుబలి దేవస్థానాల నమూనాలను లక్షలాది పుష్పాలతో తీర్చిదిద్దనున్నారు. ఆనాటి రాజుల అభివృద్ధి, కళాతృష్ణను చాటేలా పుష్పరూపాలు ఏర్పాటవుతాయని ఉద్యావనశాఖ అధికారులు తెలిపారు. కన్నడ భాష, విద్య, నీటిపారుదల, సాహిత్యం, కళలు వాస్తుశిల్పాలు, రాష్ట్ర కూటులతో యుద్ధాల గురించి పుష్ప ఆకృతులను ఏర్పాటు చేస్తారు. గంగ రాజుల పాలనను చాటిచెప్పడమే ఫ్లవర్‌ షో లక్ష్యమని రాష్ట్ర ఉద్యానవశాఖ అదనపు డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.జగదీశ్‌ తెలిపారు. ఆగష్టు 6వ తేదీన ఆరంభమయ్యే ఫ్లవర్‌ షో 17 వరకు జరుగుతుందని చెప్పారు.

స్వాతంత్య్ర దినోత్సవ థీమ్‌ ఇదే

ఆగస్టు 6 నుంచి లాల్‌బాగ్‌లో ఫ్లవర్‌ షో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement