దొడ్డబళ్లాపురం: గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తున్న చిరుతలు ఇటీవల బెంగళూరు సిటీలో కూడా ప్రత్యక్షమవుతుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. బ్యాడరహళ్లిలోని భరత్ నగరలో చిరుత రాత్రివేళ దర్జాగా రోడ్లమీద తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో చుట్టుపక్కల జనం చీకటి పడిందంటే బయటకు రావడానికి భయపడిపోతున్నారు. 9వ తేదీ నుంచి ఇప్పటి వరకూ నాలుగుసార్లు చిరుత సంచరించిన కెమెరాలలో రికార్డయింది. అటవీశాఖ అధికారులు బోనులు పెట్టగా, అది అటువైపు రావడం లేదు. సోమవారం రాత్రి 13వ క్రాస్‌లో ఒక వీధి కుక్కను బలితీసుకుంది. దీంతో జనం తెల్లవారున వాకింగ్ వెళ్లడానికి జంకుతున్నారు.
మెట్రోలో మళ్లీ అంతరాయం
యశవంతపుర: మరోసారి బెంగళూరు మెట్రో రైలు వ్యవస్థలో ప్రయాణికులు ముప్పావు గంట అవస్థలు పడ్డారు. విద్యుత్ అంతరాయంతో నమ్మ మెట్రో గ్రీన్ మార్గంలో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సిల్క్ ఇన్‌స్టిట్యూట్– యశవంతపుర మధ్య మెట్రోలో ఇబ్బంది ఏర్పడింది. యశవంతపుర, మాదావర మధ్య కొంతసేపు మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. వాయువ్య విభాగంలో మాదావర నుంచి దక్షిణ విభాగం సిల్క్ ఇన్‌స్టిట్యూట్ వరకు లింక్ మార్గంలో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. ఆఫీసులకు వెళ్లే సమయంలో ఇదేమిటని ప్రయాణికులు మెట్రో అధికారులపై ఆగ్రహించారు. చాలామంది బస్సులు, క్యాబ్‌లలో వెళ్లిపోయారు. 8:45 గంటలకు సరిచేయడంతో రైళ్లు మామూలుగా నడిచాయి.
స్కూల్‌లో విద్యార్థిని మృతి
మైసూరు: పాఠశాలల్లో బాలల మరణాలు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లాలోని టి.నరసిపుర తాలూకా, తలకాడు పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో తరగతిలో విద్యార్థిని కుప్పకూలి చనిపోయింది. వివరాలు.. విద్యార్థిని శాలిని (14), ఈమె మండ్య జిల్లా, మలవళ్లి తాలూకా, బిలిజగలిమోలే గ్రామానికి చెందిన శివన్న కుమార్తె. ఈమె తలకాడు పట్టణంలోని సమర్పణ స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. పాఠం వింటూ ఉన్న బాలిక అలాగే పడిపోయింది. టీచర్లు సమీపంలోని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బాలిక మరణించినట్లు తెలిపారు. తలకాడు పోలీసులు మైసూరులోని కె.ఆర్. ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి, మతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత శాలిని మరణానికి కారణాలు తెలుస్తాయని చెప్పారు. గుండెపోటు వచ్చి ఉంటుందని అనుమానాలున్నాయి.
కొకై న్ విక్రేత పట్టివేత
యశవంతపుర: కొకైన్ మత్తు పదార్థం అమ్ముతున్న ఉత్తరప్రదేశ్ డ్రగ్ పెడ్లర్‌ను బెంగళూరు చామరాజపేట పోలీసులు అరెస్ట్ చేసి నుంచి రూ.1.6 కోట్ల విలువగల 116 గ్రాముల కొకై న్‌ను, కారును స్వాధీనం చేసుకున్నారు. 19న అర్ధరాత్రి కన్సర్‌వెన్సి రోడ్డులో డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిసి పోలీసులు దాడి చేశారు. కారును రోడ్డు పక్కలో నిలిపి చాక్లెట్ పెట్టెలో కొకై న్‌ను ఉంచి అమ్ముతుండగా పట్టుకున్నారు. నిందితుడు రాజు (30)ను అరెస్ట్ చేశారు. అక్షిత్ అనే మరో నిందితుడు పరారయ్యాడు. రాజు ఇచ్చిన సమాచారంతో కోరమంగల, బాణసవాడి, వైట్‌ఫీల్డ్, మల్లేశ్వరం, పులకేశినగర పోలీసుస్టేషన్ల పరిధిలో 9 మంది ఇతర డ్రగ్స్ వ్యాపారులను గుర్తించి పట్టుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయి లభించింది.
స్కూటీ డిక్కీలోని
రూ.2 లక్షల మాయం
మైసూరు: ప్యాలెస్ సిటీలో దొంగల బెడద అధికమైంది. స్కూటీ డిక్కీలో ఉంచిన రూ.2 లక్షల నగదును క్షణాల్లోనే దుండగులు చోరీ చేసిన ఘటన మైసూరులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగర నివాసి, బీఈఎంఎల్ రిటైర్డ్ అధికారి ఎం.కృష్ణప్పకు అతని కుమార్తె రూ.2 లక్షలు డ్రా చేసుకుని రమ్మని చెక్ ఇచ్చింది. ఆ ప్రకారం స్థానిక కెనరా బ్యాంకు బ్రాంచిలో కృష్ణప్ప డబ్బు డ్రా చేసుకుని బయటకు వచ్చి స్కూటీ డిక్కీలో పెట్టుకున్నాడు. ఆ సమయంలో స్నేహితుడు ఎదురై చెక్ రాసివ్వమని కోరాడు. దీంతో కృష్ణప్ప మళ్లీ బ్యాంకు లోపలకు వెళ్లి చెక్ రాసిచ్చి తిరిగి ఇంటికి వచ్చి చూసుకోగా స్కూటీ డిక్కీలో నగదు సంచి మాయమైంది. విజయనగర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మైసూరులో ఇటువంటి చోరీలు అధికం కావడంతో ప్రజల్లో గుబులు నెలకొంది. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన ముఠాలు ఈ చోరీలు చేస్తున్నట్లు అనుమానాలున్నాయి.


