బనశంకరి: బెంగళూరు జేపీ నగర మూడో ఫేజ్‌లోని శివబాలయోగి ఆశ్రమంలో మరకత శివలింగం ఆలయంలో సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. విభూతితో త్రినేత్రున్ని అలంకరించి, భస్మహారతి, పూజలు చేశారు. భక్తులు పెద్దఎత్తున స్వామిని దర్శించుకున్నారు.
సుప్రీంతో జూదమాడొద్దు
● ధర్మస్థల తిమరోడికి మందలింపు
బనశంకరి: దక్షిణ కన్నడ జిల్లా నుంచి రాయచూరు జిల్లా మాన్వి తాలూకాకు బహిష్కరిస్తూ పుత్తూరు సబ్ కలెక్టర్ జారీచేసిన ఆదేశాలను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ధర్మస్థల సౌజన్య హత్య కేసు పోరాటదారుడు మహేశ్‌శెట్టి తిమరోడి కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బహిష్కరణను సమర్థించిన సుప్రీంకోర్టు అతని అప్పీల్ ను తిరస్కరించి, కోర్టుతో జూదమాడవద్దని దండించింది. సోమవారం జడ్జిలు జస్టిస్ సంజయ్‌కుమార్, సంజీవ్‌సబ్‌దేవ తో కూడిన ధర్మాసనం విచారించి, ఇదివరకే హైకోర్టు తిరస్కరించడాన్ని ప్రస్తావించింది. ప్రజల మనోభావాలతో ఆడుకోవడం సరికాదని, అభ్యంతరాలు ఉంటే స్థానిక కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని ఆదేశించింది.
బిడదిలో భూ గొడవలు
● అధికారులపై మహిళల దాడి
దొడ్డబళ్లాపురం: టౌన్‌షిప్ ఏర్పాటు నేపథ్యంలో బెంగళూరు సమీపంలోని బిడది పరిధిలోని రైతులు, భూ యజమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మండలహళ్లిలో భూమి సర్వే చేయడానికి వెళ్లిన అధికారులపై గ్రామస్తులు రాళ్లు, చెప్పులు, చీపుర్లతో దాడిచేయడంతో ఉద్రిక్తత నెలకొంది. జీబీఏ అధ్యక్షుడు నటరాజు మాట్లాడుతూ మండలహళ్లి గ్రామంలో 27మందిలో 21 మంది తమ భూములు సర్వే చేయాలని కోరారు, ఆ మేరకు అధికారులు సర్వే చేయడానికి వెళ్లారు, అయితే గ్రామస్తులు కొందరు అడ్డుకుని దాడులు చేశారు అని చెప్పారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్, గ్రామస్తులను హెచ్చరించడంతో తమ భూమిని స్వాధీనం చేసుకోబోమని రాసిస్తే సర్వే చేయడానికి అనుమతిస్తామని అన్నారు.
నమామి వాయుపుత్ర
బనశంకరి: బనశంకరి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన వరప్రసాద ఆంజనేయస్వామి ఆలయంలో కుంభాభిషేకం ఘనంగా సాగింది. వేకువజామున ఆలయ అర్చకులు వాయుపుత్రునికి అర్చనలు, అభిషేకం, పూజలు నిర్వహించారు. ప్రత్యేక హోమాలు, పూజలు చేపట్టి కుంభాభిషేకం నిర్వర్తించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతించారు.
మురిపించిన భక్తిగాన కచేరీ
చింతామణి: సాధు సంతులు అనుభవంతో రచించిన కీర్తనలు శ్రేష్ఠమైనవని కై వార ధర్మాధికారి డా. జయరాం తెలిపారు. కై వారంలో శ్రీ యోగి నారేయణ సంగీత కళా శిక్షణ ట్రస్టు వార్షికోత్సవం సందర్భంగా గాయకులు భక్తిగాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగీతం శ్రేష్ఠమయిన కళ, ప్రతి ఒక్కరు భక్తి మార్గాన్ని ఎంచకోవాలన్నారు. సాధువుల రచనలు మానవ జీవితం సాగించడానికి నీతి పాఠాలవుతాయన్నారు. కై వార తాతయ్య, త్యాగరాజ, కనకదాస, పురంధరదాస, అన్నమయ్య కీర్తనలను గాయకులు శ్రావ్యంగా ఆలపించారు.


