రాయచూరు రూరల్: ఈ ఖరీఫ్ సీజన్‌లో ముందుగా కురిసిన వర్షాలకు పంటలు సాగు చేసిన నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం అందజేయాలని కర్ణాటక రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం దేవదుర్గ తాలూకా గణేకల్‌లో శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు సంతోష గౌడ మాట్లాడుతూ.. కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోయాయని తెలిపారు. శనగ, పెసలు, జొన్న, పత్తి, పొద్దు తిరుగుడు, కంది తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిహారం అందజేయాలని కోరుతూ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.
మాజీ శాసన సభ్యుడు యాసిన్‌కు నివాళి
రాయచూరు రూరల్: నగరంలోని ఈద్గా మైదానంలో సోమవారం రాయచూరు నగర మాజీ శాసన సభ్యుడు సయ్యద్ యాసిన్ అంత్యక్రియలు ముగిశాయి. అంతకుముందు మంగళవార పేట కాలనీలో ప్రజల సందర్శనార్థం యాసిన భౌతికఖాయాన్ని మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఉంచారు. మాజీ మంత్రి బోసురాజ్, ఎంపీ కుమార నాయక్, ఎమ్మెల్యే హంపయ్య నాయక్ తదితరులు యాసిన మృతదేహానికి పూలమాలల వేసి నివాళులర్పించారు.
రోడ్డు ప్రమాదంలో
దంపతులు దుర్మరణం
సాక్షి, బళ్లారి: లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన చిత్రదుర్గం జిల్లా హోళాల్కెర పట్టణ శివారులోని జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. హోలాల్కెర పట్టణానికి చెందిన మారుతీ గ్యాస్ ఏజెన్సీ, సిద్ధి సుజకి షోరూం యజమాని లోహిత్ ప్రసాద్ (45), భార్య నిత్యశ్రీ (40) కారులో శివమొగ్గ నుంచి చిత్రదుర్గానికి బయలుదేరారు. కిరిదాద కణివే ప్రదేశంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. తీవ్రంగా గాయపడిన లోహిత్ ప్రసాద్, అతడి భార్య నిత్యశ్రీ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ ఆత్మహత్య
క్రిష్ణగిరి: సూళగిరి తాలూకా బేరికె సమీపంలో మహిళ ఆత్మహత్య చేసుకొంది. బేరికె సమీపంలోని కే.ఎన్.దొడ్డి గ్రామానికి చెందిన రమేష్ భార్య కావ్య (28). వీరు గత పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. ఇద్దరు పిల్లలున్నారు. కొన్నిరోజులుగా కావ్య అనారోగ్యంతో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ వచ్చింది. ఫలితం లేకపో‘డంతో విరక్తి చెందిన ఆమె ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని చనిపోయింది.
వామ్మో మొసలి..
హొసపేటె: మరియమ్మనహళ్లి పట్టణంలోని దానాపూర్ సమీపంలో లారీ పార్కింగ్ స్థలం వెనుక ఉన్న గుంతలో మొసలి ప్రత్యక్ష్యం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పశువులు, గొర్రెలకు నీరు తాపేందుకు కాపరులు ఈ గుంత దగ్గరికి వస్తారు. ఉదయం వేళల్లో వాకింగ్ చేసేందుకు ఇక్కడికి ప్రజలు వస్తుంటారు. అయితే అకస్మాత్తుగా గుంతలో మొసలి కనిపించడం కలకలం రేపుతోంది. మొసలి నీటిలోంచి బయటకు వచ్చి.. కొద్ది క్షణాల్లోనే తిరిగి వెళ్లిపోతున్న దృశ్యాలను యువకులు వీడియో తీశారు. సంబంధిత శాఖ అధికారులు ఆ మొసలిని పట్టుకుని మరో ప్రదేశానికి తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ‘ఈ గుంతలో మొసలి ఉన్నట్లు తెలిసింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సిబ్బందిని అక్కడికి పంపించాం. మొసలి బయటకు వస్తే దాన్ని పట్టుకుని కమలాపూర్ జూకు తరలిస్తాం’ అని విజయనగర్ జిల్లా జోనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కౌశిక్ దళ్వాయి తెలిపారు.


