మత్తు చిత్తులో జీవచ్ఛవం | - | Sakshi
Sakshi News home page

మత్తు చిత్తులో జీవచ్ఛవం

Apr 12 2026 2:36 AM | Updated on Apr 12 2026 2:36 AM

బెంగళూరులో మత్తు భూతంపై మరోసారి చర్చ

సంచలనానికి కారణమైన జాంబీ రాజవీర్‌సింగ్‌

సాక్షి, బెంగళూరు: యువకుడు నిశ్చలంగా సుమారు నిమిషాల పాటు స్తబ్దుగా అలా నిలబడిపోయాడు, డ్రగ్స్‌ తీసుకోవడం వల్ల ఇలా జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇది జాంబీ డ్రగ్స్‌ వల్ల కలిగిన పరిణామమని చాలామంది కామెంట్లు చేశారు. ఇది చాలా ఆందోళనకరం, ఏమిటో తేల్చాలని నటుడు దునియా విజయ్‌ కూడా కోరారు. హోం మంత్రి జి.పరమేశ్వర్‌ ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా ఇప్పుడు జాంబీ మత్తు రోగి చర్చకు కారణమయ్యాడు.

జాంబీ డ్రగ్స్‌ ఉన్నాయా?

జాంబీ డ్రగ్స్‌ అనేది మెదడు పనితీరును స్తంభింపజేసే మాదకద్రవ్యం. బతికున్న మనిషి జీవచ్ఛవంగా మారిపోతాడు, అమెరికాలో ఇటువంటి మత్తు పదార్థాలు వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో భారతదేశంలో కూడా ఈ జాంబీ డ్రగ్స్‌ ఆచూకీ లభ్యమైనట్లు సమాచారం. అందులోనూ బిహార్‌ వంటి రాష్ట్రాల్లో ఇది లభ్యమైనట్లు తెలుస్తోంది. వెర్రెత్తే మూగజీవాలను శాంతపరించేందుకు ఇటువంటి శక్తిమంతమైన మత్తు పదార్థాలను వాడతారని తెలిసింది. అయితే ఇటీవల కాలంలో మనుషులు దీనిని ఎక్కువ మత్తు కోసం సేవిస్తున్నారు. ఈ డ్రగ్‌ సేవించిన మనుషులు గంటల కొద్దీ రోడ్డుపై, ఎక్కడుంటే అక్కడ జాంబీలా నిశ్చలంగా నిలబడి ఉండిపోతారు. ఇలాంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి.

బెంగళూరులో మత్తు బెడద

ఇటీవల కాలంలో బెంగళూరులో డ్రగ్స్‌ విక్రయాలు, వినియోగాలు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యార్థులను, యువకులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్‌ విక్రయాలు జరుగుతున్నాయి. తరచుగా పోలీసులు దాడులు జరిపి కేజీల కొద్దీ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు.

కమిషనర్‌ ఏమన్నారంటే..

జాంబీ డ్రగ్‌ వీడియోపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అలాంటి డ్రగ్‌ అంటూ ఏదీ లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని, వీడియోను వైరల్‌ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్‌ సీమంత్‌ కుమార్‌ చెప్పారు. వీడియోలో ఉన్న వ్యక్తిని గుర్తించినట్లు, అతడు ఇక్కడి వాడు కాడని, మద్యం సేవించిన తర్వాత మెడిసిన్‌ తీసుకోవడం వల్ల ఈ విధంగా జరిగిందని తెలిపారు. ప్రస్తుతం అతనికి వైద్య చికిత్స అవసరమని, ఎలాంటి డ్రగ్స్‌ అతడు తీసుకోలేదని చెప్పారు.

అతనొక లారీ డ్రైవర్‌

ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పంజాబ్‌కు చెందిన లారీ డ్రైవర్‌ రాజవీర్‌ సింగ్‌.. ఇతడు గతంలో హఫీం అనే మత్తుకు అలవాటు కావడంతో కుటుంబీకులు డీ అడిక్షన్‌ సెంటర్‌లో చేర్పించారు. బెంగళూరుకు వచ్చిన ఇతడు కొందరు డ్రైవర్లతో కలసి షెడ్‌లోనే నివసిస్తున్నాడు. ఇతనికి కీళ్లనొప్పులు, సైనసైటిస్‌ అనే వ్యాధులు ఉన్నాయి. మద్యం కూడా తాగుతాడు. అలా మద్యం తాగిన తరువాత రెండు మాత్రలు తీసుకున్నాడు. దీనివల్ల రియాక్షన్‌ జరిగి నడవలేక అలాగే నిలబడిపోయాడు. జాంబీ డ్రగ్స్‌ వాడాడని కొందరు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని తెలుస్తోంది.

బెంగళూరు జాంబీ మ్యాన్‌

వ్యవహారం..

దేశవ్యాప్తంగా చర్చనీయాంశం

డ్రగ్స్‌ వల్లే అని ప్రచారం

అదేం లేదన్న పోలీసులు

వైరల్‌ చేశాడు.. అరెస్టయ్యాడు

బనశంకరి: జాంబీ డ్రగ్స్‌ అంటూ వీడియో షేర్‌ చేసిన ప్రైవేటు కంపెనీ ఉద్యోగి, విద్యారణ్యపుర నివాసి హేమంత్‌ కుమార్‌కు నోటీసులు ఇచ్చిన బాగలూరు పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. ఇటువంటి తప్పుడు సమాచారం వైరల్‌చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ సీమంత్‌ కుమార్‌సింగ్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement