శివాజీనగర: మంత్రిమండలిలో మార్పులు చేయాలని కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో హస్తిన వైపు దృష్టి సారించారు. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు ముగిసింది, 3, 4సార్లు గెలుపొందిన తమకు మంత్రి పదవులు ఇవ్వాలని సీనియర్ ఎమ్మెల్యేలు ఆదివారం లేదా సోమవారం ఢిల్లీలో హైకమాండ్ పెద్దలను కలిసే అవకాశముంది. సుమారు 35 మందికి పైగా ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఏఐసీసీ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, కే.సీ.వేణుగోపాల్, రణదీప్‌సింగ్ సుర్జేవాలా తదితరులను కలిసి తమ డిమాండ్లు తెలుపుతామని కొందరు ఎమ్మెల్యేలు చెప్పారు. రెండు అసెంబ్లీ క్షేత్రాల ఉప ఎన్నికలు కూడా అయిపోవడంతో తమ గొంతును గట్టిగా వినిపించాలని తీర్మానించారు. ఎమ్మెల్యే టీ.బీ.జయచంద్ర ఈ బందంలో ఉన్నారు, తాము ఢిల్లీకి వెళ్లి నేతలను కోరడం తథ్యమని చెప్పారు. ఎంతమందికి మంత్రిమండలిలో అవకాశం లభిస్తుందో తెలియదు, అనుభవజ్ఞులకు ఇవ్వాలని కోరుతామని, ఎవరినీ కేబినెట్ నుంచి తొలగించాలని చెప్పమని, హైకమాండే తీర్మానిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి మార్పు గురించి చర్చించబోమన్నారు. ఒకవేళ చర్చల్లో ప్రస్తావనకే వస్తే అది కూడా మాట్లాడతామని తెలిపారు.
దావణగెరె చిచ్చు రేగింది
అధికార కాంగ్రెస్‌లో దావణగెర దక్షిణ అసెంబ్లీ క్షేత్రం ఉప ఎన్నికల చిచ్చు రేగింది. ఇక్కడ జరిగిన గొడవలపై ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శి అభిషేక్ దత్ హైకమాండ్‌కు నివేదిక ఇవ్వగా, కేపీసీసీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అబ్దుల్ జబ్బార్ శనివారమే పార్టీ పదవికి రాజీనామా చేశారు. మైనారిటీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని గృహ నిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ ఒత్తిడి చేయడంతో దావణగెరెలో పార్టీకి ఇబ్బందిగా మారింది. దీంతో అభిషేక్ దత్ విచారణ జరిపారు. పార్టీ గెలుపుపై ప్రభావం ఉండొచ్చని ప్రచారమూ ఉంది. పార్టీ సస్పెండ్ చేస్తుందని తెలిసి జబ్బార్ ముందే తప్పుకున్నారు. సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నజీర్ అహమ్మద్‌ను కూడా సాగనంపే అవకాశముంది. వివాదానికి మూలబిందువైన మంత్రి జమీర్ అహమ్మద్ మీద వేటు పడవచ్చని ప్రచారం మొదలైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ పరిణాలేవీ తెలియదని దాటవేత ధోరణిని ప్రదర్శించారు.
మంత్రి పదవుల కోసం పట్టు
పార్టీలో దావణగెరె
ఉప ఎన్నికల రచ్చ..
ఓ సీనియర్ నేత రాజీనామా


