చెరువులో నుంచి కార్తీక్ మృతదేహాన్ని
వెలికి తీస్తున్న దృశ్యం
రాయచూరు రూరల్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా కొత్త బట్టలు ధరించాలనుకున్న స్నేహితులు చిన్న కారణానికి ఉన్మాదులుగా మారి తోటి స్నేహితుడిని హత్య చేసిన ఘటన రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా కరడకల్ చెరువులో జరిగింది. ఆదివారం గుండసాగర గ్రామం నుంచి లింగసూగూరు పట్టణానికి కొత్త బట్టల కొనుగోలుకు తొమ్మిదో తరగతి చదువుతున్న కార్తీక్(15), వినోద్(15), సోహైల్(15), ముత్తప్ప(15) అనే నలుగురు పిల్లలు వచ్చారు. అయితే వీరిలో కార్తీక్ మినహా ముగ్గురు మాత్రమే సాయంత్రానికి గ్రామానికి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో కార్తీక్ తల్లిదండ్రులు తమ కొడుకు ఆచూకీ తెలియక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మార్గమధ్యంలో కార్తీక్‌ను తామే చంపి గోనెసంచిలో రాయి కట్టి చెరువులోకి తోసి వేసినట్లు పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించారు. సోమవారం చెరువులో గాలించి కార్తీక్ శవాన్ని వెలికితీసి పంచనామా కోసం లింగసూగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ అరుణాంగ్శు గిరి పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై నిందితుల నుంచి పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. లింగసూగూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్ తెలిపారు.
లింగసూగూరు తాలూకాలో దుర్ఘటన


