బనశంకరి: రాష్ట్రంలో జిల్లాలతో పాటు రాజధాని బెంగళూరులో కమర్షియల్ గ్యాస్, ఇళ్లకు సిలిండర్ల సరఫరా రోజురోజుకూ క్షీణిస్తోంది. ప్రజలు పనులు మానుకుని సిలిండర్ల కోసం పరుగులు తీస్తున్నారు. ఇక హోటళ్లు, కేటరింగ్, విద్యాలయాల హాస్టళ్లు, బేకరీలు, వివాహాది శుభకార్యాలతో పాటు నిత్యం ఆహారం అవసరమైన అన్నిచోట్లా తీవ్ర కటకట ఏర్పడింది.
బుక్ చేసినా లేవు
కమర్షియల్ గ్యాస్ బండలు దొరకడం లేదు. ఆర్డర్ బుక్ చేసినా లేవని చెబుతున్నారని హోటళ్ల యజమానులు ఆరోపించారు. ఫలితంగా నగరంలో పెద్దసంఖ్యలో హోటళ్లను మూసేశారు. చిన్నా చితకా క్యాంటీన్లు, వీధి హోటళ్లదీ అదే పరిస్థితి కావడంతో బ్రహ్మచారులు ఆహారం కోసం రోడ్ల వెంబడి అన్వేషించాల్సి వస్తోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల నెల కావడంతో ముందుగా కళ్యాణ మండపం బుక్ చేసినప్పటికీ సిలిండర్లు లభించని కారణంగా వంట చేయడం ఎలా అనే సమస్య ఏర్పడింది. కేటరింగ్ చేసేవారు అవస్థలు పడుతున్నారు.
పండుగల నెలలో కష్టాలు
బెంగళూరులో కొన్ని చోట్ల హోటల్స్, బేకరీలలో కట్టెల పొయ్యితో వండుతున్నారు. చిన్నపాటి హోటళ్లు, కళ్యాణ మండపాలలో కట్టెల పొయ్యిలు వెలిశాయి. రంజాన్ ఉపవాసాల నెల కావడంతో తెల్లవారుజామునే హోటళ్లలో పొయ్యి మీదే వంటకాలు వండారు. నగర ప్రదేశాల్లో కట్టెలు పొయ్యిలు చాలా తక్కువ. కానీ గత్యంతరం లేక వాటినే ఆశ్రయించారు. పెద్ద హోటల్స్‌లో కట్టెలు పొయ్యి వాడితే పొగ ఆవరిస్తుందని వెనుకంజ వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం పడనుంది.
గ్యాస్ కొరత లేదు, అంతా బాగానే ఉంది అని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవంగా అలా లేదని తెలుస్తోంది. గ్యాస్ ఏజెన్సీల వద్ద రద్దీనే దానికి నిదర్శనం. గురువారం నగరంలో అనేకచోట్ల విపరీతమైన రద్దీ ఏర్పడింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో కానీ, సిలిండర్ల సమస్య లేకుండా చూడాలని, వంట చేయలేక పోతున్నామని పలువురు మహిళలు వాపోయారు.
సిలిండర్ల కోసం హోటళ్లు, జనం హాహాకారాలు
ఏజెన్సీల ముందు మహిళల క్యూ
బెంగళూరులో భారీగా హోటళ్ల మూసివేత
గత్యంతరం లేక కట్టెలపొయ్యిపై వంటకాలు
ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధం, పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులతో యుద్ధం రోజురోజుకు పెరుగుతోందే తప్ప తగ్గే సూచనలు లేకపోగా, ఉద్యాననగరిలో ఆ ఎఫెక్టు బాగా కనిపిస్తోంది. సామాన్య ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం కష్టాలు పడుతున్నారు. గ్యాస్ వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. హోటళ్లలో టిఫిన్లు, భోజనాలు దొరకడం కనాకష్టంగా మారింది. ఇంట్లో పొయ్యి వెలగక, హోటళ్లో తిండి దొరకక చాలామంది అన్నమో రామచంద్రా అనాల్సి వస్తోంది.
కేంద్రం పట్టించుకోవాలి: డీసీఎం
శివాజీనగర: వేరే విషయాల గురించి మాట్లాడే రాష్ట్ర ఎంపీలు వంటగ్యాస్ సిలిండర్ల కొరతపై పార్లమెంటులో చర్చించాలి, రాష్ట్రానికి న్యాయం చేయాలని డీసీఎం డీ.కే.శివకుమార్ సూచించారు. ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ ‘వంటగ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది. కానీ బీజేపీకి చెందిన ఏ ఎంపీ నోరు మెదపలేదు. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చేసేదేమీ లేదు, కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. కేంద్ర ప్రభుత్వం విదేశాంగ విధానంపై స్పష్టంగా మాట్లాడటం లేదు, ఈ ధోరణి ఖండనీయం. ప్రజలకు ప్రయోజనం కలిగేలా కేంద్రం వ్యవహరించాలి, గ్యాస్ సమస్య అధికమవుతోంది, మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో, ఇప్పటికే గ్యాస్ ఆటోలు బంద్ అయ్యాయి’ అని అన్నారు.
గ్యాస్ గోదాములు తనిఖీ చేయండి
పోలీసులకు డీజీపీ ఆదేశం
బనశంకరి: గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందా జరగకుండా చూడాలని డీజీపీ ఎంఏ.సలీం పోలీసులను ఆదేశించారు. బెంగళూరు సిటీలోని ప్రతి గ్యాస్ గోదామును పోలీసులు తనిఖీ చేయాలని, ఉన్న సిలిండర్లు, వచ్చిన ఆర్డర్లు, వితరణ చేసినవి ఎన్ని అనేది తనిఖీ చేయాలని తెలిపారు. నల్లబజారులో అమ్మినా, ఎక్కువ ధర వసూలు వంటి అక్రమాలకు పాల్పడినట్లు తేలితే, కేసులు నమోదు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. గ్యాస్ సిలిండర్లు లేవని చెప్పినా, ఎక్కువ ధరలు కోరినా ఆయా ఏజెన్సీల మీద ప్రజలు సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని తెలిపారు.
సీఎస్ సమీక్ష
గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో హోటల్ యజమానులు సంఘం నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలినీ రజనీష్ విధానసౌధలో సమావేశం నిర్వహించారు. అధికారులు, గ్యాస్ కంపెనీలు ప్రతినిధులు పాల్గొన్నారు. ఆసుపత్రులు, పీజీలకు గ్యాస్ కొరత లేకుండా చూడాలని శాలినీ సూచించారు. హోటల్స్‌లో అదనంగా సిలిండర్లను ఉంచుకోరాదని తెలిపారు. ఇంకా 2 నుంచి 5 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రజల ఫిర్యాదులకు ఓ హెల్ప్‌లైన్ ప్రారంభించాలని చెప్పారు.


