యశవంతపుర: టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో మెడిసిన్ విద్యార్థిని దుర్మరణం చెందిన ఘటన బెంగళూరు కెంగేరి పరిధిలో జరిగింది. మైసూరు రోడ్డులోని ఆర్‌ఆర్ మెడికల్ కాలేజీ సమీపంలో బుధవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. మెడిసిన్ ఫైనలియర్ చదివే కృతిక (21), మరో మెడికో హంస సాయంత్రం 4.15 గంటల సమయంలో కాలేజీ ముగించుకొని స్కూటర్‌లో బయటకు వచ్చారు, మైసూరు రోడ్డు వైపు వెళుతుండగా వారిని వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొని దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన కృతికా అక్కడే చనిపోగా, హంస ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దుర్ఘటనతో సహచర మెడికోలు పరుగున అక్కడికి వచ్చి ఆవేదనకు లోనయ్యారు. కెంగేరి పోలీసులు ఘటన స్థలిని పరిశీలించి టిప్పర్ డ్రైవర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
కరెంటు షాక్‌తో
లైన్‌మెన్ మృతి
మైసూరు: ట్రాన్స్‌ఫార్మర్‌ను మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతంతో ఓ లైన్‌మెన్ మరణించిన ఘటన జిల్లాలోని పిరియాపట్టణ తాలూకా చిక్కనేరళె గ్రామ పంచాయతీ పరిధిలోని వడేర హొసహళ్లిలో జరిగింది. గ్రామానికి చెందిన బాలకృష్ణ (38) మృతుడు. ఇతను విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు పనులు చేస్తుండగా ఆకస్మికంగా విద్యుత్ ప్రసారం కావడంతో షాక్ కొట్టి కిందపడిపోయాడు. ఇతర సిబ్బంది, స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లే పనిలో ఉండగానే మరణించాడు. మృతుని తండ్రి సణ్ణస్వామిగౌడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెట్టదపుర స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేఆర్‌నగర సెస్క్ ఉప విభాగం ఈఈ ప్రదీప్, అధికారులు మృతునికి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయనకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు.
మే ఆఖరులోగా టీబీ డ్యాం 6 గేట్ల మార్పు
శివాజీనగర: తుంగభద్ర డ్యాం 6 గేట్లను మే ఆఖరిలోగా మార్చుతామని డీసీఎం డీకే శివకుమార్ విధాన పరిషత్‌లో తెలిపారు. పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డ్యాం నిర్వహణ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందినదని అన్నారు. గేట్ల పనులు అహ్మదాబాద్ కంపెనీకి ఇచ్చామని, సామాగ్రి వచ్చిందని, పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. గేట్లను త్వరగా అమర్చి రైతులకు నీటిని విడుదల చేయాలని, పంటలు ఎండిపోకుండా చూడాలని సభ్యులు డిమాండ్ చేశారు.
30 మంది జీవిత ఖైదీలకు విముక్తి
బనశంకరి: రాష్ట్రంలో వివిధ జైళ్లలో సత్‌ప్రవర్తనతో ఉన్న 30 మంది జీవిత ఖైదీలను ముందే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపారు. మొత్తం 54 మంది ఖైదీల ప్రవర్తనను పరిశీలించిన సదరు కమిటీ 31 మంది జీవిత ఖైదీలను విడుదల చేయాలని సిఫార్సు చేసింది. వీరిలో ఒక మహిళా ఖైదీ పెరోల్ సెలవులో ఉండగా చనిపోయింది. బెంగళూరు సెంట్రల్ జైలులో 14 మంది, విజయపుర కేంద్ర జైలులో 5 మంది, బళ్లారి జైలులో ముగ్గురు, మిగతా జైళ్లలో ఒకరిద్దరు ఖైదీలు విడుదలవుతారు. వృద్ధాప్యం, మంచి ప్రవర్తన, ఇప్పటివరకు అనుభవించిన శిక్షాకాలం తదితరాలను పరిగణించి విడుదలకు ఆదేశించారు.
పిరియా పట్టణమ్మ రథోత్సవం
మైసూరు: మైసూరు జిల్లాలోని పిరియాపట్టణలో గురువారం వేలాది మంది భక్తుల మధ్య శక్తిదేవత శ్రీ పిరియాపట్టణ (మస ణికమ్మ) దేవి బ్రహ్మ రథోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి అమ్మవారి ఉద్భవ విగ్రహానికి వివిధ అభిషేకాలు, పూజలు జరిగాయి. తరువాత విగ్రహాన్ని మేళతాళాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. ఆపై తేరులో ప్రతిష్టించి 12:10 గంటల తరువాత మంగళహారతి ఇచ్చి రథోత్సవానికి శ్రీకారం చుట్టారు. తేరు కదలగానే భక్తజనం అమ్మవారిని స్మరిస్తూ పండ్లు, ధాన్యాలను తేరుమీదకు విసిరారు. భక్తుల ఆకలిని తీర్చడానికి అనేక సంఘాలవారు పండ్లు, మజ్జిగ, సాంబార్ అన్నం, కేసరిబాత్, శీతల పానీయాలను పంపిణీ చేశారు. అమ్మఫ్రెండ్స్ యూనియన్ మధుగౌడ, హరీష్‌గౌడ ఉచితంగా ఐస్‌క్రీంలను అందజేశారు.


