తుమకూరు: రాష్ట్రంలో ఎస్టీ వర్గాలకు 7 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ప్రభుత్వం 56,437 ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఎస్టీ, ఎస్టీ సముదాయాల వివిధ డిమాండ్లను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ వాల్మీకి నాయక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లాధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రిజర్వేషన్ తమ హక్కు, భిక్ష కాదు, రిజర్వేషన్ కావాలి అని నినాదాలు చేశారు. యువతీ యువకులతో పాటు ఆ వర్గానికి చెందిన రిటైర్డు అధికారులు పాల్గొన్నారు.
వీసా పేరిట మహిళకు
రూ.5 లక్షల వంచన
మైసూరు: సింగపూర్‌కు వెళ్లేందుకు వీసా చేయించి ఇస్తామని మహిళను వంచకులు నమ్మించి రూ.5 లక్షలు స్వాహా చేసిన ఘటన మైసూరులో జరిగింది. గోకులం నివాసి, ఇంజనీర్ అయిన మహిళకు మెరిలియన్ వీసా సొల్యూషన్ అనే సంస్థ వాట్సాప్ ద్వారా వీసా చేయించి ఇస్తామని సందేశం వచ్చింది. దీనిని నమ్మిన ఆమె ఆ సంస్థను మొబైల్ నంబరు ద్వారా సంప్రదించింది. వారు చెప్పినట్లు ఖాతాకు దశల వారీగా రూ.5,34,272లను బదిలీ చేసింది. ఎన్నిరోజులైనా వీసా పని జరగలేదు. చాలాసార్లు ఫోన్ చేసినా స్పందన కరువవడంతో మోసపోయిన మహిళ సైబర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఎయిర్‌పోర్టులో రూ.1.57 కోట్ల గంజాయి సీజ్
దొడ్డబళ్లాపురం: కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు రూ.1.57 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నాడు బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుని లగేజీ చెక్ చేస్తుండగా బ్యాగులో రహస్యంగా దాచి ఉంచిన 4.5 కేజీల హైడ్రో గంజాయి పట్టుబడింది. సరుకు విలువ రూ.1.57 కోట్లుగా అధికారులు తెలిపారు. ప్రయాణికున్ని అరెస్టు చేశారు.
డ్రైవరు దుర్బుద్ధి..
యజమాని ఇంట్లో చోరీ
దొడ్డబళ్లాపురం: ఒక కారు డ్రైవర్ తన యజమాని ఇంట్లోనే దొంగతనం చేసిన ఘటన బెంగళూరు అమృతహళ్లి ఠాణా పరిధిలో జరిగింది. వివరాలు.. జక్కూరు నివాసి అభిలాష్ గౌడ (30) డ్రైవరు కాగా, రియల్టర్ ప్రతీక్ వద్ద గత 10 ఏళ్లుగా పని చేస్తున్నాడు. ప్రతీక్ కుటుంబం అతన్ని సొంత కుటుంబీకునిగా చూసుకునేది. ఇంట్లో వారి వద్ద ఉన్న బంగారు నగలు, డబ్బు గురించి అభిలాష్ తెలుసుకున్నాడు. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో రూ.14.65 లక్షల విలువైన బంగారు నగలను కొట్టేశాడు. అతని స్నేహితుడు మదన్ కూడా పాల్గొన్నాడు. కొన్ని రోజులకు ప్రతీక్ కుటుంబీకులు బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తు చేసి అభిలాష్‌గౌడ ఎత్తుకెళ్లాడని, ఇప్పటికే అమ్మేశాడని గుర్తించారు. ఇద్దరినీ అరెస్టు చేసి, బంగారాన్ని రికవరీ చేశారు.
జయహో కోలారమ్మ
కోలారు: నగర దేవత కోలారమ్మ బ్రహ్మ రథోత్సవం బుధవారం నగరంలో ఘనంగా జరిగాయి. తహసీల్దార్ నయన, నగరసభ కమిషనర్ నవీన్‌చంద్ర, అర్చకులు పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. నగరంలోని ప్రముఖ వీధుల గుండా తేరును లాగారు. భక్తులు తేరు మీదకు దవనం, అరటిపండ్లు విసిరారు.


