శివమొగ్గ: శివమొగ్గలోని బసవేశ్వర నగర్ 2వ స్టేజ్ ప్రధాన రోడ్డులోని కాలువ వంతెన సమీపంలో ఈనెల 6న రాత్రి సమయంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో స్నేక్ క్యాచర్ కిరణ్ అక్కడకు చేరుకొని ఎనిమిది అడుగుల పొడవు, 15 కిలోల బరువు ఉన్న కొండచిలువను బంధించాడు. అనంతరం అటవీ శాఖ సిబ్బంది సమక్షంలో దానిని అడవిలో వదిలేశాడు.
బాగల్‌కోటెలో పోలీసుల మోహరింపు
దొడ్డబళ్లాపురం: బాగలకోటెలో శివాజీ జయంతి ఊరేగింపులో రాళ్లు రువ్విన సంఘటన మరువకముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఒక వ్యక్తి తన కుమారుడితో ఓ సముదాయానికి చెందిన ప్రార్థనా మందిరం గోడమీద జై శ్రీరామ్ అని రాయించాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రార్థనా మందిరం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు యమనూరు పోలీసులు ఆ తండ్రీకుమారుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. గోడపై ఉన్న రాతలను చెరిపేశారు. ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలు మొహరింపజేశారు.
ప్రధాని రాజీనామా చేయాలి
● సీఎం సిద్ధరామయ్య డిమాండ్
బనశంకరి: సిలిండర్ ధర పెంచిన ప్రపంచ స్థాయిలో దేశం పరువు తీస్తున్న ప్రధాని నరేంద్రమోదీ రాజీనామా చేయాలని సీఎం సిద్దరామయ్య డిమాండ్ చేశారు. శనివారం సోషల్ మీడియా ద్వారా కేంద్రప్రభుత్వంపై ధ్వజమెత్తిన సీఎం గృహవినియోగ సిలిండర్ల ధర సుమారు రూ.60ల పెంపుతో పేద, మధ్యతరగతి కుటుంబాల నిర్వహణవ్యయం భారం అవుతుందన్నారు. సిలిండర్ల ధర పెంపు అనివార్యం కాదన్నారు. విదేశాంగ విధానంలో వైఫల్యంతో నరేంద్ర మోదీ అమెరికా మాటలకు తలొగ్గి దేశ స్వాతంత్య్రాన్ని ఆ దేశానికి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. రష్యా, ఇరాన్ లాంటి దేశాలతో భారత్ దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యం పాడైందన్నారు. అంతేగాక అనేక దశాబ్దాలుగా భారతీయులకు ఇంధనం అందిస్తున్న దేశాలు అని మోదీ మరిచిపోయారని మండిపడ్డారు.
సర్కారుపై కాంట్రాక్టర్లు కదం
శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం శనివారం నగరంలోని ఫ్రీడం పార్కులో భారీ ధర్నా నిర్వహించింది. ధర్నాను ఉద్దేశించి సంఘం అధ్యక్షుడు మంజునాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసినా కూడా ప్రభుత్వం గత రెండేళ్ల నుంచి పెండింగ్ సొమ్ము విడుదల చేయలేదన్నారు. దీంతో కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కర్ణాటకలో సుమారు 1.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకొన్న చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లు ఉండగా, గత మూడేళ్ల నుంచి వివిధ శాఖల ద్వారా పనులను పూర్తి చేసినా కూడా పెండింగ్ సొమ్ము విడుదల కాలేదని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్టర్లకు ఎలాంటి ప్రత్యేక అనుకూలాలు కాలేదన్నారు. గత ప్రభుత్వం కంటే కొన్ని శాఖల్లో కమీషన్ ప్రమాణం అధికంగా ఉందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. సుమారు 10 వేల మంది కాంట్రాక్టర్లు రాష్ట్ర నలుమూల నుంచి తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు.


