దొడ్డబళ్లాపురం: కారు– బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందిన సంఘటన గదగ్ జిల్లా ముండరగి తాలూకా మేవుండి వద్ద జరిగింది. శివప్ప పాటిల్ (35), ముత్తప్ప (32), ఆనంద్ (29) ముండరగి తాలూకా జంత్లి గ్రామవాసులు. ముగ్గురూ గురువారం రాత్రి ఒకే బైక్‌పై ముండరగి నుండి జంత్లి గ్రామానికి వెళ్తూ ఉన్నారు. ఎదురుగా వేగంగా వచ్చిన కారు వీరిని ఢీకొనింది. ఈ దుర్ఘటనలో పై ముగ్గురూ అక్కడే చనిపోగా, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ముండరగి పోలీసులు కేసు నమోదు చేశారు.
చెవులు కోసి నగలు చోరీ
● దొంగల కిరాతకం
శ్రీనివాసపురం: చెవి కమ్మలను దొంగిలించడానికి ఏకంగా మహిళ చెవిని కోసేసి లాక్కెళ్లిన కిరాతక దొంగల ఉదంతమిది. కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలూకాలోని హూవళ్లి గ్రామంలో జరిగింది. గురువారం రాత్రి రత్నమ్మ (70) అనే వృద్ధురాలు పడుకుని ఉండగా దొంగలు చొరబడ్డారు. ఆమె మెడలోని 25 గ్రాముల బంగారు చైన్‌ను లాక్కున్నారు. చెవి కమ్మలను ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఆమె తిరస్కరించడంతో దొంగలు కత్తితో చెవులను కోసేసి కమ్మలను లాక్కుని పరారయ్యారు. శుక్రవారం ఉదయం ఎస్పీ, సిక్రివాల్, పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి వివరాలను తెలుసుకున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుని నగలను తిరిగి అందిస్తామని హామీ ఇచ్చారు. క్లూస్‌టీం, జాగిలాలతో గాలించి ఆధారాలను సేకరించారు. బాధితురాలికి ఆస్పత్రిలో వైద్యం చేయించారు. ఈ సంఘటనతో గ్రామంలో మహిళలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
కాంగ్రెస్ పాలన విఫలం: యడ్డి
మైసూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసుగు చెందారు. వారు మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజల కోరిక మేరకు రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి నేను రాష్ట్ర పర్యటన చేపట్టానని బీజేపీ నేత, మాజీ సీఎం బి.ఎస్.యడియూరప్ప అన్నారు. శుక్రవారం చాముండేశ్వరి దేవస్థానాన్ని దర్శించుకుని పూజలు చేశారు. తరువాత సుత్తూరు మఠానికి వెళ్లి శివరాత్రి దేశికేంద్ర స్వామిని కలిశారు. మఠంలోనే అల్పాహారం తీసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ, సీఎం సిద్ధరామయ్య సర్కారు ప్రజలందరి నమ్మకాలను వమ్ము చేసిందని, సీఎం కుర్చీ కోసం గొడవలు పడుతున్నారని, శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు ఆయన వెంట వచ్చారు.
వెంకట గిరియప్ప స్వామికి పూజలు
మాలూరు: తాలూకాలోని డీఎన్ దొడ్డి గ్రామంలో ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో భాగంగా శుక్రవారం వెంకట గిరియప్ప స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిని ప్రధాన అర్చకుడు అనిల్ కుమార్ పూలతో అలంకరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం జరిగింది.


