దొడ్డబళ్లాపురం: బెళగావిలో ఎక్కడంటే అక్కడ కార్లు నిలిపి అందులోనే మద్యం తాగుతున్నవారి మీద పోలీసులు కన్నేశారు. పోకిరీలు సిటీలో రోడ్డుపక్కన, హైవేలపై కార్లు నిలిపి అందులోనే మద్యం పార్టీలు చేసుకునే సంఘటనలు ఎక్కువయ్యాయి. నిర్జన ప్రదేశాలు, మైదానాలు ఇలా ఎక్కడపడితే అక్కడ కారు బార్ దందాలు అధికమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదులు రావడంతో వారం రోజులు తనిఖీలు చేయగా ఇలాంటివి 24 ఘటనలు బయటపడ్డాయి, కేసులు నమోదు చేసి 36 మందిపై చర్యలు తీసుకున్నారు. రాత్రివేళ రోడ్డుపక్కన కార్లు నిలిపి మద్యం తాగి ప్రయాణిస్తూ గొడవలకు, ప్రమాదాలకు కారణమవుతున్నారు.
ఎథనాల్ ట్యాంకర్ బోల్తా.. మంటలు
● హావేరి జిల్లాలో ప్రమాదం
సాక్షి, బళ్లారి: హావేరి జిల్లాలో రాణిబెన్నూరు పట్టణ శివారులో జాతీయ రహదారిలో గురువారం ఎథనాల్ ట్యాంకర్ లారీ బోల్తా పడి అగ్నిప్రమాదం జరిగింది. ఆ ట్యాంకర్ హుబ్లీ నుంచి బెంగళూరు వైపు వెళ్తూ ఉండగా అదుపు తప్పి సర్వీసు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. క్షణాల్లోనే ఎథనాల్ లీకై ట్యాంకరు నుంచి మంటలు లేచాయి. డ్రైవర్ పరుగులు తీసి బయటపడ్డాడు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా, చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిలో గంటల తరబడి వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనే ఆరోపణలున్నాయి. రాణిబెన్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
సోషల్ మీడియా పోస్టు కేసులో డీకేకు ఊరట
శివాజీనగర: గతంలో బీజేపీ నాయకులను కించపరిచేలా పోస్టు పెట్టారనే కేసులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై నమోదైన కేసులో హైకోర్టు స్టే జారీ చేసింది. దీంతో డీకేకు ఊరట లభించింది. హుబ్లీలో 1992లో జరిగిన రామ జన్మభూమి పోరాటంలో పాల్గొన్న హిందూ కార్యకర్త శ్రీకాంత పూజారిని ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అరెస్ట్ చేసి జైలుకు పంపింది. దీనిని ఖండిస్తూ బీజేపీ నాయకులు మేము కూడా కరసేవకులు, అరెస్టు చేయాలి అని అభియానను ప్రారంభించారు. దీనిని ఖండిస్తూ డీకే శివకుమార్ ఎక్స్‌లో పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు రెండు వర్గాల మధ్య ద్వేషం రేకెత్తించేలా ఉన్నాయని బీజేపీ నాయకులు బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో డీకే పై కేసు నమోదైంది.
నంది హిల్స్‌లో కార్చిచ్చు
చిక్కబళ్లాపురం: విశ్వవిఖ్యాత నంది హిల్స్‌లో మంగళవారం సాయంత్రం నుంచి కార్చిచ్చు వ్యాపించింది. కొండ మధ్యభాగంలో మంటలు లేచి క్రమంగా సుల్తాన్‌పేట వరకు వ్యాపించాయి, సుమారు 10 ఎకరాలలో చెట్లు, గుట్టలు కాలిపోయాయి. ఎత్తైన కొండప్రాంతం కావడంతో అక్కడకు అగ్నిమాపక వాహనాలు వెళ్లలేవు. పాదచారి మార్గం నుంచి పైకి వెళ్లి అగ్నిని ఆర్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేసవి ఇప్పుడే ప్రారంభం కాగా అగ్నిప్రమాదాలు మొదలైనట్లు అనుమానాలున్నాయి.
బీజేపీలో విభేదాలు
నిజమే: విజయేంద్ర
యశవంతపుర: తమ పార్టీలో విభేదాలున్న మాట వాస్తవమే. త్వరలో వాటిని పరిష్కరించుకొంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. గురువారం దావణగెరెలో మాజీ ఎంపీ రేణుకాచార్య వర్గం నేతలు ఓ రిసార్ట్‌లో జరిపిన భేటీలో విజయేంద్ర పాల్గొన్నారు. తరువాత విలేకరులతో మాట్లాడుతూ దావణగెరె జిల్లాలో చిన్నపాటి లోపాలున్నాయి. అన్నింటినీ సరి చేసుకొంటాం, దావణగెరె దక్షిణ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల గురించి టికెట్ ఆకాంక్షులతో చర్చించామని తెలిపారు. త్వరలో మరో వర్గం నేతలతో భేటీ జరిపి
అభ్యర్థిని ఎంపిక చేస్తామని చెప్పారు.


