రాయచూరు రూరల్: మద్యం తాగిన మత్తులో స్నేహితుడు హత్య చేసిన ఘటన బుధవారం రాత్రి యాదగిరి జిల్లా సురపుర తాలూకా కెంబావిలో చోటు చేసుకుంది. హోలీ పండుగ సందర్భంగా రంగులు చల్లుకొని రాత్రి పీకలదాకా మద్యం తాగినప్పుడు వాగ్వాదం చెలరేగింది. దీంతో మద్యం బాటిల్‌తో రవికుమార్(37)ను పొడిచి చంపినట్లు జిల్లా ఎస్పీ పృథ్వీ శంకర్ తెలిపారు. నిందితుడు మాయన్న(36) అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ శంకర్, డీఎస్పీ జావేద్ ఇనాందార్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యాదగిరి ఆస్పత్రికి తరలించారు. కెంబావి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చెరువులో మునిగి
యువకుడు మృతి
రాయచూరు రూరల్: చెరువులో ఈత రాక యువకుడు నీటి పాలైన ఘటన రాయచూరు తాలూకా మర్చటాళ్‌లో బుధవారం సాయంత్రం జరిగింది. హోలీ పండుగ సందర్భంగా రంగులు చల్లుకొని చెరువులో స్నానానికి వెళ్లిన శరణప్ప(30) నీటిలో మునిగి మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చెరువు చుట్టూ తీగ ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
వేద అధ్యయన
సందేశాలు బోధించాలి
రాయచూరు రూరల్: భారత దేశంలో హిందూ ధర్మంలో వేద అధ్యయన సందేశాలను పిల్లలకు చాటాలని కొత్తల బసవేశ్వర సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బసవరాజ్ పాటిల్ సేడం పేర్కొన్నారు. గురువారం దేవదుర్గ తాలూకా సుల్తాన్‌పురలో గురులింగ శివాచార్య ఆధ్వర్యంలో జంగమ వటులకు ఏర్పాటు చేసిన వేద అధ్యయన శిబిరాలు, సామూహిక వివాహాలను జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు సనాతన సంప్రదాయాలు, ఆచార, విచారాలు, భారతీయ సంస్కృతిపై అవగాహన కల్పించి వారికి శిబిరంలో నేర్పే విద్య చిరకాలం గుర్తుంటుందన్నారు. నూతనంగా దాంపత్యంలోకి అడుగు పెడుతున్న నవజంటలు స్వామీజీల ఆశ్వీరాదాలతో శాంతియుత జీవితం గడపాలన్నారు. సుల్తాన్‌పుర శంభు సోమనాథ, కిల్లే బృహన్మఠం పీఠాధిపతి శాంతమల్ల శివాచార్య, సోమవారపేట మఠాధిపతి అభినవ రాచోటి వీర శివాచార్య, కపిల సిద్దరామ స్వామి, జాగటగల్ స్వామీజీ, ప్రశాంత్, గిరిజా శంకర్‌లున్నారు.
నిరుద్యోగాన్ని రూపుమాపండి
హొసపేటె: కేంద్ర ప్రభుత్వంలోని 78 మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 9.78 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిరుద్యోగ సమస్య తీవ్ర రూపాన్ని సంతరించుకుందని ఏఐడీవైఓ నేత ప్రకాష్ నాయక్ పేర్కొన్నారు. యువతకు ఉపాధిని కోరుతూ ఏఐడీవైఓ సంస్థ జిల్లాధికారి ద్వారా ప్రధానమంత్రికి గురువారం వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఇలానే ఉందన్నారు. 2014లో ప్రతి సంవత్సరం యువతకు 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా అవినీతి, ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఉద్యోగుల తొలగింపు, ప్రభుత్వ శాఖల ప్రైవేటీకరణ పరిస్థితిని మరింత దిగజార్చాయన్నారు. ప్రజల పెరుగుతున్న అవసరాలను పరిగణనలోకి తీసుకుని వారి బలం, సామర్థ్యానికి అనుగుణంగా అందరికీ ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. ప్రతి సంవత్సరం వేలాది మంది యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు. 2023లో యువత ఆత్మహత్యల సంఖ్య 14,234కి పెరిగిందన్నారు. అందువల్ల ఈ సమస్యల నుంచి యువతను రక్షించడానికి తమ సంస్థ పోరాడుతుందన్నారు.
వివాహిత ఆత్మహత్య
మైసూరు: చామరాజనగర తాలూకా అమచావాడి గ్రామంలో భర్త, అత్త వేధింపులను తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పల్లవి (30) మృతురాలు. ఆమె భర్త మహేష్ దంపతులు కాగా, ఏడాది కూతురుంది. భర్త, అత్త చిక్కతాయమ్మ తరచూ పల్లవిని సూటిపోటి మాటలతో వేధించేవారు. భర్త తాగి హింసిస్తున్నాడు. దీంతో విరక్తి చెందిన పల్లవి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి సిద్ధశెట్టి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు.


