ఆశలు తీర్చేనా.. నిరాశ పర్చేనా? | - | Sakshi
Sakshi News home page

ఆశలు తీర్చేనా.. నిరాశ పర్చేనా?

Mar 6 2026 8:20 AM | Updated on Mar 6 2026 8:20 AM

నేటి నుంచి 27 వరకు అసెంబ్లీ

ప్రతిపక్షాల చేతిలో పదునైన ఆయుధాలు

● రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నేడు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి.

● మార్చి 27వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు అసెంబ్లీ జరుగుతుంది.

● సీటు రగడ, బడ్జెట్‌ చర్చలు, రాష్ట్రంలో ప్రముఖంగా నలుగుతున్న పలు అంశాలతో పోరాటానికి ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌లు సిద్ధమయ్యాయి.

● గత ఉభయ సభల సమావేశాల్లో ఎకై ్సజ్‌ మంత్రి తిమ్మాపుర లంచాల గోలతో సర్కారుకు తీవ్ర ఇక్కట్లు వచ్చాయి. నాలుగైదు రోజులు అదే చర్చ జరిగింది.

● ఈసారి బడ్జెట్‌లో పథకాలకు, ఆయా జిల్లాలకు కేటాయింపులు, నీటి ప్రాజెక్టుల ప్రగతి, నరేగా, కరువు సాయం తదితరాలతో ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశముంది.

● గ్యారెంటీల భారం, ఖజానా దివాలా తీసిందని, అప్పులు ఎక్కువయ్యాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అంతేకాకుండగా సొంత మంత్రులపైనే ఫోన్‌ ట్యాపింగ్‌ నిఘా పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఇది అసెంబ్లీలో చర్చించే అవకాశముంది.

● ఇటీవల ధార్వాడలో జరిగిన నిరుద్యోగ ఆందోళన ప్రభంజనం ప్రతిపక్షాలకు ఆయుధాన్ని ఇచ్చినట్లయింది. నిరుద్యోగుల్లో వేడిని చల్లార్చేందుకు సీఎం సిద్దరామయ్య బడ్జెట్లో ఉద్యోగ నియామకాలను భారీగా ప్రకటించాల్సి ఉంటుంది.

● ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి మరింతగా నిధులకు డిమాండ్‌ చేసే అవకాశముంది.

● సీఎం మార్పిడి రచ్చ, విదేశీ టూర్లు, విందు భేటీలు కూడా ప్రస్తావనకు రాబోతున్నాయి. మొత్తం మీద ఈ బడ్జెట్‌ సమావేశాలు అందరి అనుమానాలను తీర్చేలా ఉండాలని కోరుతున్నారు.

శివాజీనగర: సీఎం సీటు మార్పిడి వివాదాలను తట్టుకుని ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేడు శుక్రవారం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రకటించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కానుండగా, తొలిరోజే 2026–27 బడ్జెట్‌ను సీఎం సమర్పిస్తారు. ఆర్థికమంత్రి, సీఎంగా ఆయనకు ఇది 17వ బడ్జెట్‌ కావడం విశేషం. దీంతో రాష్ట్రంలో అత్యధిక బడ్జెట్‌లు సమర్పించిన సీఎంగా రికార్డులు సృష్టించారు. ఈ బడ్జెట్‌ ప్రజలకు సంతోషం కలిగిస్తుందా?, పన్నుల వాత వేస్తుందా? అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది.

కత్తి మీద సామే

బడ్జెట్‌ మీద రైతులు, మహిళలు, సామాన్య ప్రజలు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు.. ఇలా అన్ని రంగాలవారూ ఆశలు పెట్టుకోవడంతో సిద్దరామయ్యకు కత్తిమీద సాముగా మారింది. విద్య, నీటి పారుదల, పశు సంవర్ధక, వ్యవసాయ, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. సీఎం సీటు రభస వల్ల ఆలస్యంగా బడ్జెట్‌ సన్నాహక సమావేశాలను నిర్వహించిన సీఎం ఆయా వర్గాలతో భేటీలు జరిపారు. గత బడ్జెట్‌లో పంచ గ్యారెంటీ పథకాలకు రూ. 56 వేల కోట్లు కేటాయిస్తే మొత్తం 70 వేల కోట్ల వరకూ ఖర్చయినట్లు తెలిసింది, ఇది సర్కారుకు పెద్ద ఇబ్బందిగా మారింది. దీంతో ఈ పద్దులో మరిన్ని నిధులను గ్యారెంటీలకు కేటాయించాల్సి రావచ్చు. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పనులకు భూ స్వాధీనానికే రూ.70 వేల కోట్లు అవసరముంది. ఈ సారి అందుకు రూ.10 వేల కోట్లను ప్రకటించే అవకాశముంది.

భారీ కేటాయింపులు కావాలి

వైద్య ఆరోగ్యశాఖ, వ్యవసాయ, హోం, నగరాభివృద్ధి, రవాణా, ప్రజాపనులు వంటి శాఖలు కూడా భారీగా కేటాయింపులను కోరుతున్నాయి. అన్ని నిధులను సర్దుబాటు చేయడం సిద్దరామయ్యకు సవాల్‌గా మారింది. కొత్త పథకాల కోసం అన్ని వర్గాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఏమేం స్కీములు ఉంటాయనేది కుతూహలంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాత పింఛన్‌ పథకం కోరుతున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో అది కష్టసాధ్యమని తెలుస్తోంది. అందుచేత ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త నజరానాలను ప్రకటించవచ్చని తెలుస్తోంది. సంక్షేమ పథకాల డిమాండ్లు, అందుబాటులో ఉన్న నిధులకు చాలా తేడా ఉన్న సమయంలో సమతుల్యమైన బడ్జెట్‌ను సిద్దరామయ్య ప్రకటించాల్సి ఉంది. నిధులను రాబట్టుకోవడానికి స్థిరాస్తులు, మద్యం, మోటారు వాహనాలు తదితర అనేక పన్నులను పెంచే అవకాశం లేకపోలేదు.

నేడు సీఎం సిద్దరామయ్యచే రాష్ట్ర బడ్జెట్‌

రూ.5 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనాలు

సిద్దుకు ఇది 17వ పద్దుగా రికార్డు నమోదు

ప్రజలపై భారం గ్యారెంటీ: అశోక్‌

బనశంకరి: ఈసారి సీఎం సిద్దరామయ్య రూ.1.15 లక్షల కోట్ల అప్పులు చేసి బడ్జెట్‌ సమర్పిస్తున్నారు, ప్రజలపై పన్నుల భారం వేయడం గ్యారంటీ అని బీజేపీ పక్షనేత ఆర్‌.అశోక్‌ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిద్దరామయ్య అంటే పన్నుల భారానికి మరోపేరుగా మారారు. ఇప్పటికే 36 పన్నులు ప్రజలపై వేశారు. ఆయన పదవి ముగిసేలోగా రాష్ట్రం అప్పులు రూ.8 లక్షల కోట్లకు చేరతాయని దుయ్యబట్టారు. అప్పులు చేసి ప్రభుత్వం నడపరాదు, బడ్జెట్‌ కోసం సిద్దరామయ్య రూ.1.15 లక్షల కోట్లు రుణం తీసుకుంటున్నారు, ఈ బడ్జెట్‌లో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తారు అని అన్నారు. కేపీఎస్‌సీలో కులం, డబ్బు ఉంటే చాలు, ఉద్యోగం ఇచ్చేస్తారని, దానిని మూసేయాలని కోరారు.

ఈ బడ్జెట్‌ రూ.5 లక్షల కోట్లు!

గత బడ్జెట్‌ పరిమాణం రూ.4.09 లక్షల కోట్లు కాగా, ఈదఫా రూ.5 లక్షల కోట్ల పద్దు ఉండవచ్చని అంచనాలున్నాయి. 2024–25 బడ్జెట్‌ మొత్తం రూ.3.65 లక్షల కోట్లు. ఇలా ఏటేటా రూ.40 వేల కోట్లకు పైగా సైజు పెరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement