మాంసం విక్రయాల నిషేధానికి వినతి
హొసపేటె: నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో హిందువుల పవిత్ర పండుగ అయిన మహాశివరాత్రి సందర్భంగా మాంసాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కరునాడ కలిగళ క్రియాశీల సమితి ఆధ్వర్యంలో సోమవారం వివిధ సంస్థల ప్రతినిధులు జిల్లాధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. సంఘం నేత వెంకటేష్ మాట్లాడుతూ ఫిబ్రవరి 15న జరిగే మహాశివరాత్రి అన్ని మతాలకు పవిత్రమైన పండుగ అన్నారు. దక్షిణ కాశీ హంపీలోని విరుపాక్షేశ్వరునికి ప్రత్యేక పూజలతో సహా నగరంలోని అన్ని శివాలయాల్లో పూజలు జరుగుతాయన్నారు. హిందువులందరి మనోభావాలను గౌరవిస్తూ ఆరోజురోజున మాంసం విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. పతంజలి యోగా సమితి, కర్ణాటక రాజ్య మడివాళ క్షేమాభివృద్ధి సంఘం, గుండి రమేష్ కళా వేదిక, జనతా మహాసభ, వీరశైవ లింగాయత్ మహాసభ, వీరశైవ లింగాయత్ సమాజ్, కస్తూరి కర్ణాటక జనపర వేదిక, విజయనగర సాహిత్య పరిషత్, కర్ణాటక రక్షణ వేదిక, కర్ణాటక నాగరిక హిత రక్షణసేవా ట్రస్ట్, రాష్ట్ర కార్మిక అసంఘటిత సంఘం, గౌళిగర సంఘం, జయ కర్ణాటక జనపర వేదిక, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


