బెళగావి విభజనపై సీఎం నిర్ణయమే అంతిమం
హుబ్లీ: సువిశాలమైన బెళగావి జిల్లాను విభజించాలని కోరుతూ జిల్లా నేతలు ఎన్నో సార్లు సీఎంకు విజ్ఞప్తి చేశారని మంత్రి సతీష్ జార్కిహోళి తెలిపారు. బెళగావిలోని జిల్లా బాలభవనలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన ఇండోర్ బాక్స్ క్రికెట్ సదుపాయాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన ఈ విషయమై తనను కలిసిన నేతలతో చర్చించారు. జిల్లా విభజనకు సంబంధించి సీఎం సిద్దరామయ్య తీసుకొనే నిర్ణయమే అంతిమం అన్నారు. బెళగావి అభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు కోసం వేచి చూడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే వివిధ శాఖల నుంచి అందుబాటులో ఉన్న నిధులను ప్రాధాన్యతాను సారంగా వినియోగించుకొని ప్రగతి పథంలో సాగవచ్చన్నారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అశోక్ సర్కిల్, చెన్నమ్మ సర్కిల్, కొల్హాపూర్ సర్కిల్ తదితరాలను త్వరలోనే అభివృద్ధి పరుస్తామన్నారు. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను వాడాలని మంత్రివర్గం తీర్మానించిందన్నారు. ఇది ఎంతో కీలకమైన నిర్ణయం అన్నారు. నవిలుతీర్థ జలాశయం నుంచి తాగునీటి సరఫరాపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ ఎట్టి పరిస్థితిలోను తాగునీటి అవసరాలను నిరాకరించబోమన్నారు. హిప్పరిగి జలాశయంలో ప్రస్తుతం అవసరానికి తగినట్లుగా నీరు ఉందని అన్నారు. మహారాష్ట్ర నుంచి నీటిని తీసుకునే అవసరం ఏర్పడితే ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పార్టీలకు అతీతంగా కృషి చేస్తామన్నారు.
మంత్రి సతీష్ జార్కిహోళి


