ఎంపీ చేతిలో ఖాళీ ట్రంకు పెట్టె.. లాక్కున్న పోలీసులు
సాక్షి, బెంగళూరు: మెట్రో చార్జీల వివాదంలో.. బెంగళూరు దక్షిణ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య, జయనగర ఎమ్మెల్యే రామమూర్తి నగరంలోని ఆర్‌వీ రోడ్డు మెట్రో స్టేషన్‌లో ఖాళీ ట్రంక్ పెట్టెను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఖాళీ ప్రభుత్వం అని ఆ ట్రంక్ పెట్టైపె రాశారు. దానిపై సీఎం, డీసీఎంల చిత్రాలను అంటించారు. ముందే సమాచారం అందుకున్న పోలీసులు ఆర్‌వీ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఇంతలో ఖాళీ ట్రంక్ పెట్టె పట్టుకుని తేజస్వీ సూర్య వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రతీక ఈ పెట్టె అంటూ, ప్రభుత్వం దివాళా తీసిందని ఆరోపణలు చేశారు. తాను ఎలాంటి ఆందోళన చేయడం లేదని, ఖాళీ ట్రంక్ పెట్టెను మాత్రం పట్టుకున్నానని, అడ్డుకోవద్దని ఆయన చెబుతున్నా, పోలీసులు అడ్డుకున్నారు. ట్రంకును పోలీసులు లాక్కుని, దానిపై బొమ్మలను తీసేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ఖజానాకు ప్రతిరూపంగా ఖాళీ ట్రంక్ పెట్టె పట్టుకుని తాను ఢిల్లీకి వెళతానని చెప్పారు. తమ దగ్గర డబ్బులు లేవని, ప్రయాణికుల నుంచి వసూలు చేసుకోవాలని మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఆరోపించారు. మరోవైపు విధానసౌధ వద్ద కన్నడ నాయకుడు వాటాళ్ నాగరాజు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మెట్రో చార్జీలను పెంచరాదని నినాదాలు చేశారు.
బెంగళూరులో మెట్రో స్టేషన్ వద్ద రభస
రాష్ట్ర సర్కారు ఖజానా ఇదేనన్న ఎంపీ
ఎంపీ చేతిలో ఖాళీ ట్రంకు పెట్టె.. లాక్కున్న పోలీసులు


