శెనగ కొనుగోళ్ల ప్రారంభమెన్నడో?
హుబ్లీ: ఉత్తర కర్ణాటకలో కీలకమైన పంట పప్పుశెనగ. ధార్వాడ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రబీ సీజన్‌లో వర్షాధారిత పొలాల్లో లక్ష హెక్టార్లలో శెనగ సాగు చేస్తారు. ఈ ఏడాది జిల్లాలో 2.05 లక్షల హెక్టార్లలో శెనగ సాగు చేశారు. కేంద్రం ఈసారి రూ.5765 మద్దతు ధర ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రం ప్రారంభించలేదు. కొనుగోళ్లు ఎప్పుడో తెలియక రైతులు దిగులు చెందుతున్నారు. ఇంతకు ముందు క్వింటాల్ శెనగ ధర రూ.5800 ఉండేది. ప్రస్తుతం రోజురోజుకు ధరలు తగ్గు ముఖం పడుతుండటంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
కోతల ప్రక్రియ షురూ
ఇప్పటికే కోతల ప్రక్రియ కొనసాగుతోంది. కొందరు రైతులు శెనగ రాసులు పోసి విక్రయించేందుకు ఎదురు చూస్తున్నారు. మరి కొందరు రైతన్నలు సాగు కోసం అప్పోసప్పో చేసిన రైతులు డబ్బులు కట్టేందుకు ప్రైవేట్ ఏజెంట్లు, వ్యాపారులకు శెనగలు అమ్ముకుంటున్నారు. మొత్తానికి ఈ ప్రాంత అన్నదాతలను ప్రకృతి కరుణించి శెనగ దిగుబడి బాగానే వచ్చినా మార్కెట్‌లో ధర తగ్గిన నేపథ్యంలో రైతులు దిగులు చెందుతున్నారు. కేంద్రం క్వింటాల్ ధర రూ.5785 ప్రకటించినందున వేగంగా కొనుగోలు ప్రక్రియ కూడా ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
దిగుబడి ఘనం.. పడిపోయిన ధరలు
ప్రారంభం కాని కొనుగోళ్లు
దిక్కుతోచని స్థితిలో రైతులు
పడిపోయిన దిగుబడి
ఈ సారి దిగుబడి తగ్గింది. అతివృష్టి వల్ల త్వరగా సాగు చేసి పంట దెబ్బతింది. ఖరీఫ్‌లో అతిగా కురిసిన వానల వల్ల పెసర పంట పాడైంది. అయితే శెనగ ఎలాగైనా తమను రక్షిస్తుందని అనుకుని ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టాం. ఆ మేరకు ఎకరాకు 2–3 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దళారులు సిండికేట్‌గా ఏర్పడి మోసం చేస్తారనే భయం వేస్తోంది.
– అప్పణ్ణ నదాఫ్, రైతు
ఏప్రిల్ 18 వరకూ నమోదు
కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర యోజన ద్వారా నాణ్యత కలిగిన శెనగ ఉత్పత్తిని ప్రతి క్వింటాల్ రూ.5875 ధరతో కొనుగోలు చేయడానికి కేంద్రం తెరిచాం. రైతులు పేర్లు నమోదు చేసుకునేందుకు 80 రోజుల గడువు ఇచ్చాం. గత నెల 29 నుంచి ఏప్రిల్ 18 వరకు నమోదుకు అవకాశం కల్పించాం. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. నమోదు ప్రక్రియ ముగిశాక కొనుగోళ్లు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సూచిస్తాం.
– భువనేష్ పాటిల్,
ఇన్‌చార్జి జిల్లాధికారి
గిట్టుబాటు ధర కల్పించాలి
తక్షణమే గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తే రైతులకు అనుకూలంగా ఉంటుంది. వచ్చే ఏడాది ఇంకా ఎక్కువ మద్దతు ధర ప్రకటించాలి. కోతలు కోసి ధర వచ్చే దాకా పెట్టుకునేందుకు రైతులకు గోడౌన్లు కరువయ్యాయి. ఈ విషయంలో రైతన్నలను ప్రభుత్వమే ఆదుకోవాలి.
– బసవరాజ్,
రైతు, గుడేనకట్టి
శెనగ కొనుగోళ్ల ప్రారంభమెన్నడో?


