నేత్రపర్వంగా కార్ణికోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా కార్ణికోత్సవం

Feb 5 2026 7:39 AM | Updated on Feb 5 2026 7:39 AM

నేత్ర

నేత్రపర్వంగా కార్ణికోత్సవం

సాక్షి,బళ్లారి: సాక్షాత్తు శివుడు స్వయంభువుగా వెలసిన ప్రతీతి కలిగిన ఏళుకోటి మైలార లింగేశ్వర జాతర, కార్ణిక మహోత్సవం కన్నుల పండువగా జరిగాయి. గత నెల 26వ తేదీన మాఘ సప్తమి రోజున ప్రారంభమైన మైలార లింగేశ్వర జాతర బుధవారం డెంకనమరడిలో మైలార లింగేశ్వర కార్ణికోత్సవంతో ముగిసింది. 11 రోజుల పాటు కఠిన ఉపవాసాలతో దీక్షను ఆచరించిన మైలార లింగేశ్వర స్వామి భక్తుడు, గొరవయ్య ‘సంపాయితలె పరాక్‌’ అని దైవ వాక్కు వినిపించారు. ఈ దైవ వాక్కును వినడానికి లక్షలాది మంది భక్తులు విచ్చేశారు. ప్రతి ఏటా మాదిరిగా మాఘ పౌర్ణమి అనంతరం రెండు రోజులకు ఆనవాయితీగా ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హూవినహడగలి తాలూకా మైలారలో వెలసిన ఏళుకోటి మైలార లింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం ప్రతి ఏటా మాదిరిగా కార్ణిక మహోత్సవం నిర్వహించారు. జాతర మహోత్సవంలో భాగంగా ప్రముఖ ఘట్టమైన కార్ణికోత్సవానికి గొరవయ్య ఉపవాసం ఉండి దైవ వాక్కు వినిపించారు.

కార్ణికం అంటే భవిష్య వాణి

కార్ణికం అంటే భవిష్యత్తులో జరిగే సంఘటనలు సాక్షాత్తు శివుడే తెలుపుతారని భక్తుల్లో నమ్మకం ఉంది. కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మైలార లింగేశ్వర స్వామి భక్తుడు గొరవయ్య ఎంతో నిష్టతో దాదాపు వారం రోజులకు పైగా ఉపవాసం ఉండి ఓ విల్లుపైకి ఎక్కి దైవవాణి వినిపించారు. ఈ కార్ణిక మహోత్సవాన్ని లక్షలాది మంది భక్తులు తిలకించారు.

ఎటు చూసినా జనసంద్రమే

గొరవయ్య భవిష్యవాణిని వినడానికి ప్రజాప్రతినిధులు, జిల్లాధికారి, ఎస్పీతో పాటు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలతో ఎటుచూసినా మైలారలోని డెంకణమరడి జనసంద్రంగా కనిపించింది. సాక్షాత్తు పరమేశ్వరుడు మైలారలో మైలార లింగేశ్వర స్వామిగా అవతరించి భక్తులకు దర్శనం ఇస్తుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు మైలారకు తరలివచ్చారు. మైలారలో భక్తులందరూ ఏళుకోటి మైలార లింగేశ్వర అంటూ నామస్మరణ చేశారు. డెంకనమరడిలో కార్ణికం వినడానికి ముందు పక్కనే మైలారలో ఏళుకోటి మైలారలింగేశ్వర స్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోకి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని గట్టి బందోబస్తు నిర్వహించారు.

గొరవయ్య దైవవాణి

సంపాయితలె పరాక్‌

డెంకనమరడిలో కిక్కిరిసిన

భక్తజన సందోహం

ఏళుకోటి మైలార లింగేశ్వర అని నినదించిన భక్తులు

నేత్రపర్వంగా కార్ణికోత్సవం 1
1/1

నేత్రపర్వంగా కార్ణికోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement