
యువకుడి మృతదేహం లభ్యం
బొమ్మనహాళ్: కర్ణాటకలోని కుడితిని పోలీసు స్టేషన్ పరిధిలోని తిమ్మలాపుర వద్ద హెచ్చెల్సీలో గల్లంతైన ఓ యువకుడు బొమ్మనహాళ్ మండలం దేవగిరి క్రాస్ వద్ద శవమై తేలాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన పవన్ (22) దుస్తుల వ్యాపారంతో పాటు లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉన్నాడు. ఈ క్రమంలో లారీ లోడు తీసుకుని కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని కుడితిని ప్రాంతానికి వెళ్లాడు. ఈనెల 19న తిమ్మలాపుర సమీపంలో హెచ్చెల్సీలో స్నానానికి దిగిన పవన్.. నీటి ప్రవాహ వేగానికి గల్లంతయ్యాడు. శుక్రవారం ఉదయం దేవగిరి క్రాస్ వద్ద ఉప కాలువలో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. హెచ్చెల్సీ ఎగువ ప్రాంతంలోని పీఎస్‌లకు స్థానిక పోలీసులు ఇచ్చిన సమాచారంతో కుడితిని పోలీసులు స్పందించి అందజేసిన వివరాలు సరిపోవడంతో మృతుడిని పవన్‌గా నిర్ధారించారు. మృతుడి తండ్రి పెద్దరాజు ఫిర్యాదు మేరకు కుడితిని పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.