
తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోండి
బళ్లారి టౌన్: పవిత్ర క్షేత్రం ధర్మస్థలపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని జేడీఎస్ పార్టీ జిల్లాధ్యక్షుడు మీనళ్లి తాయణ్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ధర్మస్థలలో వందలాది మందిని హత్య చేశారనే తప్పుడు సమాచారాన్ని నమ్మి రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఐటీని ఏర్పాటు చేసిందన్నారు. హత్య జరిగిందనే దానికి ఏ విధమైన ఆధారాలు లేవని తెలిపారు. అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంఘటనను వ్యతిరేకిస్తూ ఈనెల 31న రాష్ట్ర వ్యాప్తంగా నిఖిల్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో ధర్మస్థల నేత్రావతి నుంచి బృహత్ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. బళ్లారి నుంచి కూడా వందలాది మంది పార్టీ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. సమావేశంలో పార్టీ నేతలు హొన్నూరు స్వామి, పుష్ప, కిరణ్ కుమార్, శివనారాయణ, ముత్తు, ప్రదీప్, నాగవేణి తదితరులు పాల్గొన్నారు.
31న సత్యయాత్ర
రాయచూరు రూరల్: పవిత్ర క్షేత్రమైన ధర్మస్థలలో సామూహిక కిడ్నాప్, అత్యాచారాలు, హత్యలపై వస్తున్న ప్రచారాలపై ఈనెల 31న సత్యయాత్ర నిర్వహిస్తున్నట్లు జేడీఎస్ జిల్లాధ్యక్షుడు విరుపాక్షి వెల్లడించారు. శుక్రవారం ఆయన పాత్రికేయుల భవనంలో మాట్లాడారు. ధర్మస్థలపై అసత్య ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీకి తగదన్నారు. సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.