
గంగ ఒడికి వినాయకుడు
● భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం
● కోలాహలంగా విగ్రహాల ఊరేగింపు
● డీజేకు డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకున్న యువత
ఆకట్టుకున్న పంచముఖి వినాయకుడు
హుబ్లీలో అశ్వ వాహనంపై కొలువుదీరిన వినాయకుడు
బళ్లారిలో నిమజ్జనానికి ముందు వినాయకుడికి పూజలు
సాక్షి, బళ్లారి: వినాయక చవితిని పురస్కరించుకుని నగరంలోని పలు కాలనీల్లో వినాయక విగ్రహాలను కొలువుదీర్చారు. మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసిన భక్తులు శుక్రవారం వినాయకులను నిమజ్జనం చేశారు. నగరంలోని వీధుల గుండా విగ్రహాలను ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో ఊరేగించారు. వినాయక విగ్రహాల ముందు డీజేలు పెట్టుకుని, డ్యాన్స్ చేస్తూ యువత సందడి చేశారు. నగర శివారులోని హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ కాలువల్లోకి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. నగరంలో సగానికి పైగా విగ్రహాలను మూడో రోజున నిమజ్జనం చేయగా.. పలు కాలనీల్లో విగ్రహాలను ఐదో రోజు నిమజ్జనం చేయనున్నారు. విగ్రహాల నిమజ్జనానికి పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
గణపయ్యలకు ప్రత్యేక పూజలు
హుబ్లీ: స్థానిక నవనగర్‌లో వెలసిన రెండు భారీ విగ్రహాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నవనగర ప్రధాన రోడ్డు పునీత్ రాజ్‌కుమార్ సర్కిల్‌లో తొలిసారిగా సనాతన ధర్మ మండలి యువకులు భారీ సెట్టింగులతో పంచముఖి పొలిన ఆంజనేయ స్వామి వినాయకుడిని కొలువుదీర్చారు. అలాగే బసవేశ్వర సర్కిల్ సమీపంలో సాయి భక్త మండలి వారు భారీ వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఈ వినాయకుడు 11 రోజుల పాటు పూజలందుకుంటాడు. పునీత్ రాజ్‌కుమార్ సర్కిల్‌లో పంచముఖి వినాయకుడికి 21 రోజుల పాటు పూజలు చేస్తామని నిర్వహకులు తెలిపారు. ఇది ఇలా ఉండగా.. శుక్రవారం మూడవ రోజు ఇళ్లల్లో ఏర్పాటు చేసుకున్న చిట్టి పొట్టి గణపతుల విగ్రహాలను నిమజ్జనం చేశారు. 5వ రోజు మరికొన్ని చోట్ల గణపతుల నిమజ్జనోత్సవం జరగనుంది. అనంతరం 9వ రోజున ధార్వాడలో భారీ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఆ తర్వాత 11వ రోజు హుబ్లీలో విగ్రహాల నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా జరగనున్నట్లు ఆయా మండళ్లు, సమితుల ప్రముఖులు పేర్కొన్నారు.

గంగ ఒడికి వినాయకుడు

గంగ ఒడికి వినాయకుడు