
‘రక్తదానం చేసేందుకు ముందుకు రండి’
రాయచూరురూరల్: సమాజంలో ఆపద, అత్యవసర సమయాల్లో రక్తదానం చేయడానికి యువకులు ముందుకు రావాలని రోటరీ క్లబ్ అధ్యక్షుడు కిరణ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని ఇండోర్ మైదానంలో రోటరీ క్లబ్, జిల్లా బ్యాడ్మింటన్ సంఘం, జన సేవా ప్రతిష్టాన, రోటరీ కాటన్ సిటీ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. రక్తదానం.. ప్రాణదానంతో సమానమని తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా కొత్త రక్తం ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇది స్ఫూర్తిదాయకం కావాలన్నారు. కార్యక్రమంలో రంగలింగన గౌడ, హన్మంత రెడ్డి, కిరణ్, రవీంద్ర, శివ కుమార్, విశ్వనాథ్, సోమ శ్రీనివాస్, వై.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రమణీయం.. రథోత్సవం
రాయచూరురూరల్: మాన్వి తాలుకా అరోలి సిద్ధారూడ తాత రథోత్సవం వైభవంగా జరిగింది. గురువారం రాత్రి వందలాది మంది భక్తుల సమక్షంలో తొలుత రథాన్ని సుందరంగా అలంకరించారు. అనంతరం సిద్ధారూడ తాత చిత్రపటాన్ని రథంలో కొలువుదీర్చారు. అనంతరం భక్తులు రథాన్ని లాగారు. కిల్లే బృహన్మఠాధిపతి శాంత మల్ల శివాచార్య, సిద్ధారూడ మఠం నిజానంద మహాస్వామి తదితరులు సిద్ధారూడ తాతకు ప్రత్యేక పూజలు చేశారు. రథోత్సవంలో రాయచూరు, మాన్వి, సింధనూరు నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు
బళ్లారి అర్బన్: గడిగి చెన్నప్ప సర్కిల్ నుంచి ఈడిగ హాస్టల్ వరకు రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి పనులు జరుగుతున్న ఆయా ప్రాంతాలకు వెళ్లారు. పనులను పరిశీలించి అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కూల్చి వేసిన గాంధీ భవన్ ఎదుట స్థలంలో పూలు, పండ్ల వ్యాపారులు, వీధి వ్యాపారుల కోసం నిర్మిస్తున్న మార్కెట్ నిర్మాణంపై ఆరా తీశారు. జాప్యం లేకుండా ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ ఎం.రాజేశ్వరి, కార్పొరేటర్ ప్రభంజన్ కుమార్, పి.గాదెప్ప, ప్రముఖులు సుబ్బారాయుడు, నాగలకెరె గోవింద, సోమప్ప, మడివాళప్ప, ఈఈ హేమరాజ్, ఏఈఈ బసరెడ్డి, పాలికె నూతన కమిషనర్ మంజునాథ్, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా క్రీడా పోటీలు
బళ్లారి టౌన్: క్రీడలతో దేహధారుడ్యం పెంపొందించుకోవచ్చని జిల్లా యువజన సబలీకరణ ఏడీ కే.గ్రేసీ పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా పాలన, జిల్లా పంచాయతీ, యువజన క్రీడా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని జిల్లా క్రీడా ప్రాంగణంలో తాలూకా స్థాయి దసరా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడీ కే.గ్రేసీ మాట్లాడుతూ.. దేహ ఆరోగ్యానికి క్రీడలు అత్యవసరమన్నారు. క్రీడలు మన జీవన విధనాన్ని ప్రభావితం చేస్తాయని తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు సర్వసాధారణ అన్నారు. ఆరోగ్యం కోసం క్రీడల్లో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో క్రీడల తర్ఫీదుదారులు జాకీర్, మసూర్, నేతలు సిద్దు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

‘రక్తదానం చేసేందుకు ముందుకు రండి’

‘రక్తదానం చేసేందుకు ముందుకు రండి’

‘రక్తదానం చేసేందుకు ముందుకు రండి’