
అవినీతి మహమ్మారిని పారదోలాలి
రాయచూరురూరల్: రాష్ట్రంలో అవినీతి మహమ్మారిని పారదోలాలని ఉప లోకాయుక్త బి.వీరప్ప అభిప్రాయపడ్డారు. శుక్రవారం నగరంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడారు. మానవుడికి వచ్చిన క్యాన్సర్ వ్యాధిని నయం చేయవచ్చు కానీ అవినీతిని మాత్రం నయం చేయడం కుదరదన్నారు. హాస్టల్‌లో 450 మంది విద్యార్థులను చూపించి 150 మందికి భోజనం పెట్టి లెక్కలు తినే అధికారులు మన మధ్య ఉన్నారన్నారు. నగర సభలో ఖాతాలను చేయడానికి నెలల సమయం పడుతుందన్నారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తే అంతకు మించి మరేమి చేయాల్సిన పని లేదన్నారు. భూ సర్వేయర్ క్రాంతి కుమార్ సర్వేలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణతో సస్పెండ్ చేశామన్నారు. అధికారి సభకు రాకుంగా కాలయాపన చేయడం జరిగిందన్నారు. కార్యక్రమలో జిల్లాధికారి నీతిష్, న్యాయమూర్తి స్వాతిక్, రమాకాంత్, శివాజీ అనంత నలవాడే, అరవింద్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కాందు, ఎస్పీ పుట్ట మాదయ్య, సతీష్, వసంత కుమార, కళకప్ప బండి, రవి, పురుషోత్తమ, నగర సభ కమిషనర్ జుబీన్ మహాపాత్రో పాల్గొన్నారు.
ప్రజలకు సేవలందించాలి
జిల్లాలో అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహించకుండా ప్రజలకు సేవలందించాలని ఉప లోకాయుక్త బి.వీరప్ప తెలిపారు. శుక్రవారం రాయచూరులో తహసీల్దార్, నగర సభ, సాంఘిక సంక్షేమ శాఖ, సబ్ రిజిస్ట్రార్, నిర్మితి కేంద్రాల్లో పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎస్‌డీఏ ఫోన్‌లో రూ.లక్ష పోన్‌పే ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర సభలో ఇంటి, నీటి పన్నులు వసూలు చేయడంలో ముందుండాలని తెలిపారు. జనన, మరణ ప్రమాణ పత్రాల విషయంలో రూ.500 నుంచి రూ.1000 దాకా వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో అధికారుల పని తీరుపై అసహనం వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని తెలిపారు. అనంతరం చిక్క సూగూరు నీటి ట్యాంక్‌ను పరిశీలించారు.