
సంద్రంలో అలజడి.. ఒడ్డుకు పిల్ల డాల్ఫిన్లు
యశవంతపుర: అరేబియా సముద్రం వెంబడి భారీగా వానలు పడుతున్నాయి. సముద్రంలో గాలులు వీస్తూ పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, ఆ అలజడికి డాల్ఫిన్ పిల్లలు ఒడ్డుకు వస్తున్నాయి. కార్వార సమీపంలో సోమవారం జంగిల్ లాడ్జెస్ రిసార్ట్ వద్ద ఒడ్డుకు రాగా స్థానికులు వాటిని మళ్లీ సముద్రంలో వదిలారు. తుఫాన్ కారణంగా తల్లీ పిల్లలు వేరైనట్లు తెలుస్తోంది. రిసార్టులో ఉన్న పర్యాటకులు ఆ జలచరాలను ఆసక్తిగా వీక్షించి ఫోటోలు వీడియోలు తీశారు.
రేబీస్‌కు చిన్నారి బలి
దొడ్డబళ్లాపురం: నాలుగు నెలల క్రితం వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక రేబీస్‌కు గురై ప్రాణాలు వదిలింది. ఈ విషాద సంఘటన దావణగెరెలోని శాస్త్రి కాలనీలో చోటుచేసుకుంది. ఖదీరా బాను (4) అనే బాలిక నాలుగు నెలల క్రితం ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తల్లిదండ్రులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా టీకాలు వేశారు. అయితే గాయాలు తీవ్రంగా ఉండడంతో క్రమంగా బాలికకు రేబీస్ వ్యాధి సోకింది. పరిస్థితి విషమించడంతో బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న చిన్నారి ఆదివారం రాత్రి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కిరాతక భర్త చేతిలో
భార్య హత్య
మైసూరు: పొలాన్ని అమ్మి డబ్బులు తీసుకోవాలని భర్త, పొలం అమ్మరాదని భార్య పట్టుదల. చివరకు భార్య హత్యకు దారితీసింది. ఈ సంఘటన మైసూరు సిటీలోని విజయనగర ఠాణా పరిధిలోని మహాదేశ్వర లేఔట్‌లో జరిగింది. పాపన్న (56) చేతిలో గాయత్రి (45) హత్యకు గురైంది. వివరాలు.. పాపన్న గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు, నష్టాలు వచ్చాయని అప్పులు చేసి మద్యానికి బానిసయ్యాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉండగా ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు అయ్యాయి. కుమార్తెకు పెళ్లి చేయాల్సి ఉంది. కొడుకులు కష్టపడి తండ్రి అప్పులు తీర్చేపనిలో ఉన్నారు. అయినా నిత్యం డబ్బులు కావాలని భార్యా పిల్లలను సతాయించసాగాడు. సాహుకారహుండిలో ఉన్న పొలాన్ని అమ్మేద్దామని చెప్పడంతో భార్య వద్దని వారిస్తోంది. ఆదివారం కూడా గొడవ జరిగింది. ఆగ్రహం పట్టలేని పాపన్న కొడవలిలో భార్యను నరికి చంపాడు. ఇంటికి తాళం వేసి రక్తపు మరకలతో పారిపోతూ ఉండగా కొడుకు చూశాడు. ఇంటికి వెళ్లి చూడగా తల్లి మృతదేహం కనిపించింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలించి నిందితున్ని అరెస్టు చేశారు.

సంద్రంలో అలజడి.. ఒడ్డుకు పిల్ల డాల్ఫిన్లు

సంద్రంలో అలజడి.. ఒడ్డుకు పిల్ల డాల్ఫిన్లు