
టీబీ డ్యాం క్రస్ట్‌గేట్ల నిర్వహణలో విఫలం
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం టీబీ డ్యాం క్రస్ట్‌గేట్ల నిర్వహణలో విఫలమైందని, జిల్లా ఇన్‌చార్జి, కన్నడ సంస్కృతి శాఖ మంత్రి శివరాజ్ తంగడిగిని మంత్రి పదవి నుంచి తొలగించాలని బీజేపీ జిల్లాధ్యక్షుడు వీరనగౌడ డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీబీ డ్యాం పరిధిలోకి వచ్చే రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాల్లోని కాలువలకు రెండవ పంటకు నీరు ఇవ్వడం కుదరదని మంత్రి పేర్కొనడాన్ని ఖండించారు. బెంగళూరులో జరిగిన సమావేశంలో మంత్రి ప్రస్తావించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. కేంద్ర జలవనరుల శాఖ అధికారులు క్రస్ట్‌గేట్లను మరమ్మతు చేయాలని ఆదేశించినా సర్కార్ నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. క్రస్ట్‌గేట్లు పని చేయని వైనంపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రశ్నించినా జవాబివ్వక పోవడం సరికాదన్నారు. రైతులకు ఎకరాకు రూ.లక్ష పరిహారం అందించాలని కోరారు. సిద్దనగౌడ, శంకరరెడ్డి, వీపీ రెడ్డిలున్నారు.