
హనుమ భక్తుల మహాబైక్ ర్యాలీ
సాక్షి,బళ్లారి: నగరంలో హనుమ మాలధారులు చేపట్టిన బైక్ ర్యాలీ నగర వాసులను ఆకట్టుకుంది. సోమవారం సాయంత్రం మరూరు ఆభయ ఆంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న మాదిరిగానే ఈ ఏడాది కూడా హనుమ మాలధారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా హనుమ మాల ధరించడంతో ఆయన ఇచ్చిన పిలుపుతో వేలాది మంది హనుమ మాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై వీరాంజనేయ, జై శ్రీరాం, జై హనుమాన్ అంటూ నినాదాలు చేస్తూ తమ భక్తిని చాటారు. ముందుగా నగరంలో కూల్‌కార్నర్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, మాజీ లోక్‌సభ సభ్యుడు సన్న పక్కీరప్ప, బెస్ట్ స్కూల్ అధినేత కోనంకి రామప్ప, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కే.ఎస్.దివాకర్, మాజీ బుడా అధ్యక్షుడు మారుతీ ప్రసాద్, కార్పొరేటర్లు మోత్కూరు శ్రీనివాసరెడ్డి, కే.ఎస్.అశోక్ తదితరులు పాల్గొని వేదికపై ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి బైక్ ర్యాలీని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న హనుమ భక్తులు బైక్‌పై ఆంజనేయ స్వామి ఉన్న కాషాయ జెండాను కట్టుకుని, మెడలో వేసుకుని నగరంలో నినాదాలు చేస్తూ హోరెత్తించారు. గత పదేళ్లుగా కొనసాగుతున్న ఈ బైక్ ర్యాలీ ఈసారి విజయవంతం కాగా ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోందని, అదంతా ఆంజనేయ స్వామి మహిమ అని కొనియాడారు.
పెద్ద సంఖ్యలో పాల్గొన్న హనుమ మాలధారులు

హనుమ భక్తుల మహాబైక్ ర్యాలీ