
తుంగభద్ర వరద ఉగ్రరూపం
హొసపేటె: తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాచ్చింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల రైతుల జీవనాడి అయిన తుంగభద్ర డ్యాం నిండుకుండలా తొణికిసలాడుతోంది. సోమవారం డ్యాం వద్ద ఎగువ నుంచి జలాశయంలోకి 75 వేలకు పైగా క్యూసెక్కుల వరద నమోదైంది. అధికారుల లెక్కల ప్రకారం సాయంత్రానికి జలాశయంలోకి మరింత వరద పెరిగే అవకాశం ఉంది. డ్యాం వద్ద 26 క్రస్ట్ గేట్లలో 9 గేట్లను 2 అడుగులు 3 గేట్లను 3 అడుగులు, 12 గేట్లను 5 అడుగులు, ఒక గేటు 4 అడుగులు, మరో ఒక గేటు 3.5 అడుగుల మేర పైకెత్తి నదికి నీరు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో నీటిమట్టం 1624.96 అడుగులు, నీటినిల్వ 76.35 టీఎంసీలు ఉందని మండలి అఽధికారులు తెలిపారు.
కంప్లి రోడ్డు వంతెనపై నిలిచిన రాకపోకలు
తుంగభద్ర డ్యాం నుంచి నదికి లక్ష క్యూసెక్కుల మేర వరద నీటిని సోమవారం విడుదల చేయడంతో చిక్కజంతకల్ సమీపంలో ఉన్న కంప్లి రోడ్డు వంతెన పైకి నీటి ప్రవాహం చేరింది. దీంతో నదిలో తీవ్ర వరద పరిస్థితి తలెత్తింది. ఈ రహదారి గుండా వాహన రాకపోకలను నిషేధిస్తూ ప్రజా రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.
హంపీలో నీట మునిగిన స్మారకాలు
తుంగభద్ర జలాశయం నుంచి లక్షకు పైగా క్యూసెక్కుల వరకు నీరు విడుదల చేయడంతో హంపీ వద్ద నది తీరంలో ఉన్న స్మారకాలు నీట మునిగాయి. తుంగభద్ర పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హంపీ సమీపంలోని పురంధర మంటపం ఇప్పటికే పూర్తిగా మునిగింది. అనేక మంటపాల్లోకి సగం వరకు నీరు చేరింది. మరో వైపు కోదండరామ ఆలయానికి వెళ్లే దారి పూర్తిగా జలమయంగా మారింది.
పరవళ్లు తొక్కుతున్న తుంగభద్ర డ్యాం నీరు
నిండుకుండలా తొణికిసలాడుతున్న జలాశయం
డ్యాంకు ఎగువ నుంచి 75 వేలకు పైగా క్యూసెక్కుల రాక
డ్యాం వద్ద 26 క్లస్ట్ గేట్ల నుంచి దిగువకు నీరు విడుదల

తుంగభద్ర వరద ఉగ్రరూపం