
ఏకధాటి వర్షాలు.. అధ్వానంగా వీధులు
రాయచూరు రూరల్: రాయచూరు నగరంలో భారీ వర్షం కురిిసింది. సోమవారం మధ్యాహ్నం గోడ గడియారం, బస్టాండ్ రహదారిలో వర్షపు నీరు ఏరులై పారింది. ఎక్కడ చూసినా రోడ్లు నీటి గుంతలుగా మారాయి. అంబేడ్కర్ సర్కిల్, టిప్పు సర్కిల్, కసబా లింగసూగూరు, గాంధీ చౌక్, పోలీస్ స్టేషన్ చౌక్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చొరబడ్డాయి. వాటిని తొలగించుకోడానికి మహిళలు నానా తంటాలు పడ్డారు. బైరూన్‌కిల్లా, నీరుబావికుంట, మున్నూరు వాడి, గాంధీ చౌక్, మహావీర్ చౌక్, బంగికుంట, కూరగాయల మార్కెట్‌లోకి వర్షపు నీరు చొరబడ్డాయి. రాయచూరు నగరసభ పరిధిలోని ప్రధాన రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. నగరసభ ఇంజినీర్లు ముందు చూపు లేకుండా ఇష్టానుసారంగా రోడ్లను నిర్మించడంతో ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలున్నాయి.
పూడికతో నిండిన మురుగు కాలువలు
మురుగు కాలువల్లో చెత్తను సక్రమంగా ఎత్తివేయక పోవడంతో కాలువలు నిండిపోయి రహదారుల పైకి మురుగు నీరు ప్రవహిస్తున్నాయి. కాలువ మీద నిర్మించిన వంతెనల వద్ద పూడిక నిండిపోతోంది. నగరసభ అధికారులు, ఇంజినీర్లు ఇప్పటికై నా స్పందించి కాలువలో పూడికతీతకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరంలో రహదారులు అధ్వానంగా మారాయి. చిన్నపాటి వానలకు గుంతలు పడిన రహదారులను పూడ్చడంలో నగరసభ మౌనం వహించింది. ఆదివారం సాయంత్రం బోళమానుదొడ్డి రహదారిలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా అదుపు తప్పి కిందపడి గాయపడిన యువకుడిని అంబులెన్సు ద్వారా ఆస్పత్రికి తరలించారు. ఇక యాదగిరి జిల్లాలోనూ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
రోడ్లు నీటి గుంతలుగా మారిన వైనం
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు