
శనీశ్వరస్వామి వైభవం
తుమకూరు: శ్రావణ మాసంలో భాగంగా నగరంలోని శనీశ్వర ఆలయంలో విశేష పూజలు జరిగాయి. వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. సోమవారం పూల పల్లకీలో స్వామివారి ఊరేగింపు సంభ్రమం సాగింది. వీరభద్ర కునిత సహా జానపద కళాకారుల ప్రదర్శనలు రంజింపజేశాయి. ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఉత్సవం నగరంలోని ప్రధాన రహదారుల గుండా కదిలింది. ఆలయ ప్రధాన పూజారి రాజన్న, వందలాది భక్తులు పాల్గొన్నారు.
ఫ్లై ఓవర్ ర్యాంపు ప్రారంభం
శివాజీనగర: బెంగళూరులో ట్రాఫిక్‌పరంగా ఎంతో ముఖ్యమైన హెబ్బాళ జంక్షన్‌లో కే.ఆర్.పురం వైపు నుంచి మేఖ్రీ సర్కిల్ వైపు సంచరించేందుకు నిర్మించిన ఫ్లై ఓవర్ ర్యాంప్‌ని ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ర్యాంపుపై కాలేజీ రోజుల్లోని పాత యజ్డీ బైక్ మీద డీసీఎం డీ.కే.శివకుమార్ రైడ్ చేశారు. ప్రారంభోత్సవం తరువాత ప్రజల వాహనాలను అనుమతించారు. ప్రపంచంలో గుర్తింపు పొందిన బెంగళూరు నగరానికి కొత్త రూపాన్ని ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామని డీకేశి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు నటి రమ్యా పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యేపై
అత్యాచారం కేసు
దొడ్డబళ్లాపురం: మహిళపై అత్యాచారం చేశాడని మహారాష్ట్రకు చెందిన శివసేన మాజీ ఎమ్మెల్యే భగవాన్ శర్మపై బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ (40) ఫిర్యాదు చేసింది. వివాహం చేసుకుంటానని నమ్మించి ఎయిర్‌పోర్టు హోటల్‌కి తీసికెళ్లి అఘాయిత్యం చేశాడు, చిత్రదుర్గలో కూడా లైంగిక దాడి చేశాడు, పెళ్లి మాత్రం చేసుకోలేదు, వీడియోలు తీసుకుని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు పేర్కొంది. పోలీసులు కేసు విచారణ చేపట్టారు.