
టీచర్‌ని బదిలీ చేయరాదని ధర్నా
శ్రీనివాసపురం: తాలూకాలోని శెట్టిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు వరలక్ష్మిని వేరే ప్రాంతానికి బదిలీ చేసిన ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని గ్రామస్తులు సోమవారం బీఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి రామచంద్రప్ప మాట్లాడుతూ పాఠశాలలో వరలక్ష్మి టీచర్ ఎన్నో యేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కేవలం 15 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను వరలక్ష్మి టీచర్ వచ్చిన తరువాత 150 మంది అయ్యారు. ఉత్తమ టీచర్‌గా పేరు గడించారు. ఇలాంటి టీచర్‌ను అదనపు టీచర్ జాబితాలో చూపించి బదిలీ చేయడం ఎంతవరకు సమంజసమని వాపోయారు. కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులను వేరే పాఠశాలకు పంపి వరలక్ష్మి టీచర్‌ను ఇక్కడే కొనసాగించాలన్నారు. ధర్నాలో ఎస్‌డీఎంసీ అధ్యక్షుడు నవీన్, ఉపాధ్యక్షురాలు సుమిత్రమ్మ, గ్రామస్తులు చైత్ర, నవీన్‌కుమార్ తదితరులు ఉన్నారు.