
క్రికెటర్ శ్రీనాథ్ తల్లి కన్నుమూత
మైసూరు: భారత జట్టు మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి భాగ్యలక్ష్మి (88) కన్నుమూశారు. కొంతకాలంగా వయోసహజ అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మైసూరు కువెంపు నగరలోని నివాసంలో శనివారం కన్నుమూశారు. ఆదివారం చాముండి కొండ తప్పలిలోని శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు.
రూ.లక్ష లంచం..
సీఐ, ఎస్‌ఐ అరెస్టు
బనశంకరి: లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ సీఐ, ఎస్‌ఐతో పాటు ముగ్గురు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. బెంగళూరు రామమూర్తినగర పోలీస్‌స్టేషన్ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ రుమాన్ బాషా, ప్రైవేటు వ్యక్తి ఇమ్రాన్‌బాబు దొరికిపోయినవారు. వివరాలు.. తనకు తెలియకుండా తన భార్య బంగారు నగలు, నగదు తీసుకుందని, న్యాయం చేయాలని గోపీనాథ్ అనే వ్యక్తి రామమూర్తినగర ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేయాలంటే రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని సీఐ, ఎస్‌ఐలు డిమాండ్ చేశారని బాధితుడు లోకాయుక్త అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో లోకాయుక్త బెంగళూరు ఎస్పీ కే.వంశీకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు వల పన్నారు. ఆదివారం గోపీనాథ్ నుంచి సీఐ, ఎస్‌ఐ, బ్రోకరు ఇమ్రాన్‌బాబు రూ. లక్ష లంచం తీసుకుంటూ ఉండగా దాడి చేసి పట్టుకున్నారు. అరెస్టు చేసి విచారణ చేపట్టారు.