
ఆగని ఆన్‌లైన్ కేటుగాళ్ల దోపిడీ
● ఇద్దరి వ్యక్తులనుంచి రూ.లక్షలు వసూలు
హుబ్లీ: సైబర్ నేరాలపై పోలీస్, సైబర్ క్రైం విభాగాలు, ఆర్‌బీఐ తదితర సంస్థలు ఎంత చైతన్య పరచినా ప్రజలు మోసాలకు గురవుతూనే ఉన్నారు. ఆన్‌లైన్ కేటుగాళ్ల దోపిడికి అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా నగరంలో ఇద్దరి నుంచి కేటుగాళ్లు లక్షల రూపాయలు దోచుకున్నారు. నగరంలోని రియాజ్ అహ్మద్ ముల్లాకు కేటుగేళ్లు ఫోన్ చేసి స్మార్ట్ మైడ్ అలయన్స్ గ్రూప్–62లో పెట్టుబడులు పెడితే బాగా లాభాలు వస్తాయంటు నమ్మించారు. వాట్సాప్ గ్రూపులో ఆయన్ను చేర్పించి కొన్ని కంపెనీల పేరు చెప్పి రూ.9.70 లక్షలు పెట్టుబడి పెట్టించారు. అయితే నగదును డ్రా చేసుకునేందుకు యత్నించగా అవి నకిలీ కంపెనీలని తేలింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా లోన్‌లు ఇప్పిస్తామని నగరానికి చెందిన ఖాజాసాబ్ నదాప్ అనే వ్యక్తి నుంచి కేటుగాళ్లు రూ.6.14 లక్షలు తీసుకొని వంచించారు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్ చేసి పాన్, ఆధార్‌కార్డు తీసుకొని నగదును బదిలీ చేయించకున్నారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బస్సును అడ్డుకొని డ్రైవర్,
కండక్టర్‌పై దాడి
హుబ్లీ: కేఎస్ ఆర్టీసీ బస్సును ఓ వ్యక్తి అడ్డుకొని డ్రైవర్, కండక్టర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈఘటన కేశ్వపుర పోలీస్‌స్షేషన్ పరిధిలో జరిగింది. గదగ్ నుంచి హుబ్లీకి వస్తున్న ఆర్‌టీసీ బస్సు గదగ్ రోడ్డు వద్దకు చేరగానే ఓ వ్యక్తి బైక్‌ను రోడ్డుకు అడ్డంగా నిలిపాడు. బస్సు ఆగిన వెంటనే అద్దాలు బద్దలు కొట్టి డ్రైవర్ మల్లికార్జున, కండక్టర్ యల్లప్పపై దాడి చేశాడు. ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ వ్యక్తి ఉడాయించాడు. ఈ ఘటనపైడ్రైవర్, కండక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పండుగలను శాంతియుతంగా ఆచరించాలి
రాయచూరురూరల్: జిల్లాలో ఈద్‌మిలాద్, గణేష్ పండుగలను ప్రజలు శాంతియుతంగా ఆచరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లాధికారి నీతీస్ ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన అధికారులతో సమావేశమై మాట్లాడారు. 27న వినాయక విగ్రహాలను ప్రతిష్టాపించాలని, 31 న నిమజ్జనం చేయాలన్నారు. వినాయక చవితి, ఈద్ మిలాద్‌ను హిందూ ముస్లింలు కలిసిమెలసి నిర్వహించుకోవాలన్నారు. డీజేలను వినియోగిస్తే చర్యలు చేపడుతామన్నారు. ప్లాస్టిక్‌ను వినియోగించరాదన్నారు. నగరసభ కమిషనర్ జుబీన్ మోహపా త్రో, అదనపు ఎస్పీ హరీష్, కుమార స్వామి, రవీంద్ర పాల్గొన్నారు.
నిరంతర నీటి సరఫరాకు శ్రీకారం
హొసపేటె: కొట్టూరు తాలూకా కందగల్లు గ్రామం, హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని కల్లహళ్లి గ్రామంలో జేజేఎం పథకం కింద 24గంటలపాటు నీటి సరఫరాకు జెడ్పీ సీఈఓ నోంగ్‌జోయ్ మొహమ్మద్ అలీ అక్రమ్ షా శ్రీకారం చుట్టారు. ఆయన మాట్లాడుతూ నీరు చాలా విలువైనదని, నీటిని పొదుపుగా వాడుకోవాలని, వృథా చేయరాదని సూచించారు. ఆయా గ్రామాల్లో వంద శాతం గృహాలకు నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి వ్యక్తికీ రోజుకు 55 లీటర్ల నీటిని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ పథకాన్ని నిర్వహించడం గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, పంచాయతీ అధికారుల బాధ్యత అని తెలిపారు. తాలూకా పంచాయతీ కార్యనిర్వహక అధికారి లక్ష్మీకాంత్, గ్రామీణ తాగునీరు, పారిశుద్ధ్య విభాగం ఏఈ దీపా ఎస్, ఏఈఈ కూడ్లిగి ప్రసన్న బీఆర్, కందగల్లు గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు జయమ్మ ఏఎం.గాధరయ్య పాల్గొన్నారు.

ఆగని ఆన్‌లైన్ కేటుగాళ్ల దోపిడీ