
తుంగభద్రకు పోటెత్తిన వరద
● లోతట్టు ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు
హొసపేటె: కర్ణాటక, ఏపీ, తెలంగాణ, రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు సాగునీరందించే తుంగభద్ర జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువుతట్టు ఉన్న మొరాళి తీర్థహళ్లి, శివమొగ్గ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆదివారం సాయంత్రానికి 80 వేలకు పైగా క్యూసెక్కుల వరద చేరింది. 16 గేట్లను మూడున్నర అడుగులు, మిగితా 6 గేట్లకు రెండున్నర అడుగులు పైకెత్తి 80 వేల క్యూసెక్కులు దిగువుకు విడుదల చేసినట్లు మండలి అధికారులు తెలిపారు. 24 గంటల్లో లక్షకు పైగా క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. హంపీ స్మారకాలు, కంప్లి వద్ద వంతెనకు వరద ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 1625.57 అడుగులు, నీటినిల్వ 78.327 టీఎంసీలు ఇన్‌ఫ్లో 43253 క్యూసెక్కులు ఉందని మండళి వర్గాలు తెలిపారు.
పర్యాటకులతో డ్యాం కిటకిట
ఆదివారం పర్యాటకుల సందడితో కిటకిట లాడింది. గేట్ల నుంచి దిగువకు ప్రవహిస్తున్న నీటి అందాలను వీక్షించి పర్యాటకులు సంతోషంగా గడిపారు.