
కేఎస్‌ఆర్టీసీ బస్సు– లారీ ఢీ
సాక్షి,బళ్లారి: కేఎస్ ఆర్టీసీ బస్సు– లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఈఘటన సిరుగుప్ప తాలూకాలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి రాయచూరు నుంచి సిరుగుప్ప మీదుగా బెంగళూరుకు బయల్దేరిన కేఎస్ ఆర్టీసీ బస్సు సిరిగుప్ప తాలూకా సిరిగేరి పోలీసు స్టేషన్ పరిధిలో బైరాపురం క్రాస్ బీదర్– శ్రీరంగపట్టణ రాష్ట్ర రహదారిలోకి రాగానే లారీ ఎదురైంది. పరస్పరం వాహనాలు ఢీకొనడంతో బస్సు ముందు భాగం దెబ్బతింది. ప్రమాదంలో బస్సులో ఉన్న మండ్యజిల్లా మళవళ్లికి చెందిన శ్వేత(38), చెన్నపట్టణానికి చెందిన బాలానాయక్(42)మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. జిల్లా ఎస్పీ శోభారాణి, పోలీసు అధికారులు, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి, గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్.. ఒకరి మృతి
సిరుగుప్ప తాలూకాలో జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సిరుగుప్ప బాగేవాడి గ్రామానికి చెందిన డిష్ అయ్యప్ప(50) అనే వ్యక్తి బైక్‌లో వెళ్తుండగా సిరుగుప్ప తాలూకా ఇబ్రహీంపుర గ్రామ సమీపంలోని దౌలాసాబ్ రైస్ మిల్ వద్ద ట్రాక్టర్ ఢీకొంది. దీంతో బైకిస్టు అదుపు తప్పి రోడ్డు పక్కన వరి పొలంలోకి పడిపోయి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది.
ఇద్దరి మృతి
12 మందికి పైగా గాయాలు