
తుంగభద్ర వరద యథాతథం
●డ్యాం వద్ద 11 గేట్ల నుంచి నీటి విడుదల
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జీవనాడి తుంగభద్ర జలాశయానికి ఎగువన నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు యథావిధిగా కొనసాగుతుండటంతో డ్యాంకు వరద పోటెత్తుతోంది. శనివారం డ్యాంలో నీటి నిల్వ 80.003 టీఎంసీలు ఉండగా డ్యాం వద్ద 11 క్రస్ట్‌గేట్లను పైకెత్తి దిగువకు సుమారు 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంకు వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. డ్యాంలో నీటిమట్టం 1626.06 అడుగులు, ఇన్‌ఫ్లో 40 వేల క్యూసెక్కులు ఉందని బోర్డు అధికార వర్గాలు తెలిపాయి.
సర్వోత్తమ సేవా అవార్డుల ప్రదానం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో ప్రభుత్వ సేవల్లో కొలువు దీరిన అధికారుల సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సర్వోత్తమ సేవా అవార్డులను మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ చేతుల మీదుగా అందించారు. ఆగస్టు 15న మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో రాయచూరు తహసీల్దార్ సురేష్ వర్మ, స్టాటికల్ ఉద్యోగి సంతోష్ నందిని, సిరవార సీడీపీఓ అధికారి నాగరత్న, జిల్లా ఖజానా లెక్కాధికారి వెంకటాచల, మాన్వి ఆయుష్ వైద్యాధికారి రాజేంద్ర, విద్యా శాఖ ఉద్యోగి హనుమంతరాయ, సింధనూరు గ్రంథాలయం ఉద్యోగి యల్లప్ప, మిస్కి ఉద్యోగి గురునాథ్, దేవదుర్గ టీపీ ఎఫ్‌డీసీ హమీదా బేగం, మాన్వి వ్యవసాయ శాఖ అధికారి యంకణ్ణ యాదవ్‌లను మంత్రి సన్మానించారు.
ట్రామా కేర్ యూనిట్‌కు శ్రీకారం
రాయచూరు రూరల్: రాయచూరులో ట్రామా కేర్ యూనిట్‌కు రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్ పాటిల్ శ్రీకారం చుట్టారు. శనివారం ఒపెక్ ఆస్పత్రిలో ఉంచిన ట్రామా కేర్ పరికరాల గురించి ప్రత్యేక అధికారి బాలాజీ వివరించారు. ప్రజలకు ఉత్తమ రీతిలో వైద్య సేవలు అందించాలన్నారు. కళ్యాణ కర్ణాటకలోని జిల్లాల్లో ప్రజలు వ్యవసాయంపై ఆధార పడ్డారన్నారు. వ్యాధులు సక్రమించినప్పుడు స్పందించి చికిత్స అందించాలని సూచించారు. రూ.10 కోట్లతో ట్రామా కేర్ యూనిట్, క్యాన్సర్ యూనిట్లను ప్రారంభించామన్నారు. సమావేశంలో లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్, శాసన సభ్యులు శివరాజ్ పాటిల్, బసనగౌడ, ఎమ్మెల్సీ వసంత కుమార్, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, రిమ్స్ అధికారి రమేష్, గురుసిద్దయ్య హిరేమఠలున్నారు.
ఉజ్జిని సబ్‌స్టేషన్ జలమయం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి సమీపంలోని ఉజ్జిని గ్రామంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా కూడ్లిగి రోడ్డులోని 66/11 కేవీ విద్యుత్ పంపిణీ సబ్‌స్టేషన్‌లోకి పెద్ద మొత్తంలో నీరు ప్రవేశించింది. నీటి ప్రవాహాన్ని ఆపడానికి శాఖ సిబ్బంది తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ఆ ప్రాంతం పూర్తిగా మునిగింది. కార్యాలయం కాంపౌండ్ పక్కన గ్రామ మార్కెట్ నుంచి ప్రవహించే బాహ్యడ్రైనేజీ కాలువ నుంచి నీరు సబ్‌స్టేషన్‌లోకి చేరుతోంది. గ్రామ పంచాయతీ వెంటనే ఈ సమస్యపై దృష్టి పెట్టాలని ఉద్యోగులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు.
అవయవదానానికి మంత్రి అంగీకారం
హుబ్లీ: అవయవదాన వాగ్దాన పత్రంపై న్యాయ, పర్యాటక శాఖ మంత్రి హెచ్‌కే.పాటిల్ సంతకం చేశారు. రాజకీయ రంగంలో సుదీర్ఘంగా 46 ఏళ్ల పాటు క్రియాశీలుడైన ఆయన తన 72వ జన్మదిన వేళ ఈ ఆదర్శ కార్యానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ అవయవదానంలో ఆయన పేరు నమోదు చేయించారు. గుండె, కిడ్నీలు, కళ్లతో పాటు ఇతర అవయవదానాన్ని ఆయన ప్రకటించారు. తద్వారా తన జన్మదినాన్ని విశిష్టంగా ఆచరించారు. హెచ్‌కే.పాటిల్ సేవా బృందం చేపట్టిన ఈ అభియాన్‌లో శుక్రవారం వరకు 1440 మంది అవయవదాన పత్రాలను నమోదు చేయించుకున్నారు.

తుంగభద్ర వరద యథాతథం

తుంగభద్ర వరద యథాతథం

తుంగభద్ర వరద యథాతథం