
పని లేక యంత్రాల మూగ నోము
హుబ్లీ: కొప్పళ, విజయనగర, బళ్లారి జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రోణ తాలూకాకు వచ్చిన వరి కోత యంత్రాల యజమానులు, కార్మికులు పని లేక పస్తులతో గడపాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తాలూకాలో ఎక్కువగా పండించే పెసలు కోత కోయడానికి వేలాది యంత్రాలు వచ్చాయి. అయితే కుండపోత వర్షాలతో పొలాల్లో నీరు నిలవడటంతో యంత్రాలు ముందుకు వెళ్లలేక మొరాయిస్తున్నాయి. దీంతో గత 10 రోజుల నుంచి సదరు యంత్రాలకు పని లేక యజమానులు, కార్మికులు రోజు వారి కడుపు తిప్పల కోసం అగచాట్లు పడుతున్నారు. రోణ, సూడి, నరేగల్ తదితర గ్రామీణ ప్రాంతాల్లోని పొలాల్లో ప్రస్తుతం యంత్రాలదే హోరు. ఎక్కడ పడితే అక్కడ అవి కనిపిస్తున్నాయి. అయితే కొన్ని రోజుల నుంచి కార్మికులు రోడ్డు పక్కన బతుకు వెళ్లదీస్తున్నారు. జూలై చివరి వారంలో వచ్చిన ఈ యంత్రాలు ఊరి శివారులో టికానా వేశాయి. జూలైలో కొన్ని భాగాల్లో పెసలు కోత చేసి రాశులు చేసేవారు. అనంతరం పంట చేతికొస్తుందని అనుకునేంతలోనే వానలు నిరంతరంగా కురవడంతో సదరు యంత్రాల యజమానులకు ఇక్కట్లు ఓ వైపు కాగా అన్నదాతలకు మరో రకంగా బాధలు తప్పడం లేదు.
ఖరీఫ్ సీజన్‌లో పండించే పెసలు, మొక్కజొన్న, రబీ సీజన్‌లో శెనగకు ఈ యంత్రాలే ఆసరా. వ్యవసాయ కూలీల కొరత వల్లే ఈ యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. పెసల కోత, ఉల్లి కలప, నిర్వహణ కలిసి రావడంతో కూలీల కొరత కనిపిస్తోంది. దీంతో కూలీలు దొరికిన రోజుకి ఒక్కరికి రూ.400 కూలీ చెల్లించాలి. ఒక ఎకరాకు 15 మంది కూలీలు అనుకున్నా రూ.6000 కూలి చెల్లించాలి. దీనికి బదులుగా భారీ యంత్రం ద్వారా కోతలు చేస్తే రూ.1500 ఖర్చు అవుతుంది. దీంతో ఖర్చులు తగ్గించుకోవడానికి ఈ యంత్రాలను వాడటం అనివార్యం అని రైతన్న సంతోష్ కమతర్ తెలిపారు. గత 10, 15 రోజులుగా రోణ తాలూకాలో పూర్తిగా పెసల పంట కోతలు చేసి రైతులకు అండగా నిలిచే వారమని, అయితే నిరంతర వానలతో ఖాళీగా ఉండాల్సి వస్తోందని సదరు యంత్రాల యజమానులు, కూలీలు వాపోతున్నారు. వేలాది రూపాయలు ఖర్చులు చేసి దూరం నుంచి వచ్చామని ప్రస్తుతం పని లేక డబ్బు, సమయం రెండు వృథా అవుతున్నాయని బళ్లారికి చెందిన సదరు యంత్రం యజమాని రమేష్ చిక్కగౌడ్ర తన ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులకు తప్పని కడుపు తిప్పలు
పస్తులతో గడపాల్సిన దైన్య స్థితులు