
జనావాసాల్లో ఎలుగుబంటి సంచారం
హొసపేటె: హొసపేటె నగర పరిధిలో సండూరు రోడ్డులోని అంబేడ్కర్‌నగర్‌లో శుక్రవారం సాయంత్రం ఎలుగుబంటి సంచారం కాలనీ వాసులకు భయాందోళన కలిగించింది. ఓ ఇంటి ఆవరణలో ఎలుగుబంటి అతిథిగా కనిపించింది. అది ఇంటి చుట్టూ తిరుగుతుండటం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. ఆ సమయంలో పెంపుడు కుక్క ఇంటి బయట నిద్రిస్తుండగా భయపడి ఇంటి ఆవరణలోకి పరుగెత్తింది. ఆహారం కోసం వచ్చిన ఎగులుబంటి ఇంటి ఆవరణలోకి వచ్చింది. ఈ సంఘటన ఇంటి సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇది చూసిన ఇంటి యజమాని, స్థానికులు షాక్‌కు అయ్యారు. ఇటీవల రోజుల్లో నగరంలో, పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంట్ల సంచారం పెరగడంతో ప్రజల్లో భయం నెలకొంది. అదేవిధంగా అనేక గ్రామాలు, పొలాలు, కొండలు, ఇళ్ల చుట్టూ ఎలుగుబంట్లు చాలా సార్లు కనిపించినా హొసపేటె ప్రాంతంలో ఇప్పటి వరకు మనుషులపై దాడులు జరిగిన కేసులు నమోదు కాలేదు. అయితే భవిష్యత్తులో అటవీ శాఖ అత్యవసర చర్యలు తీసుకోకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖాధికారులు ఎలుగుబంటి కదలికలను పర్యవేక్షించి తక్షణమే పట్టివేతకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
హొసపేటె నగర శివార్లలో కలకలం
ప్రజలు భయాందోళనకు గురైన వైనం