
పరిశ్రమల స్థాపనతో పురోగతి
హొసపేటె: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రాసెసింగ్ పరిశ్రమలు ప్రారంభిస్తే పురోగతి సాధ్యమని జిల్లాధికారి ఎంఎస్.దివాకర్ అభిప్రాయపడ్డారు. నగరంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రధానమంత్రి చిన్న ఆహార ప్రాసెసింగ్ సంస్థల నియంత్రణ పథకంపై జిల్లా స్థాయి సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. రైతుల తక్కువ భూమిలో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. పండించిన పంటను సంరక్షించడంలో ప్రాసెసింగ్ ఒక సవాలుగా మారింది. ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద చిన్న ఆహార ప్రాసెసింగ్ సంస్థల అభివృద్ధికి రైతులకు అవకాశాలు కల్పించారన్నారు. ఈ పథకం కింద 50 శాతం లేదా గరిష్టంగా రూ.15 లక్షల సబ్సిడీ పొందే అవకాశం ఉందన్నారు. రైతులు పండించిన పంటలను ప్రాసెస్ చేయడానికి, వారి స్వంత బ్రాండ్ ద్వారా మార్కెట్‌కు చేరుకోవడానికి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. రైతులు పండించే పంటలకు మంచి బ్రాండింగ్, మార్కెట్ అందించడంలో ప్రాసెసింగ్ ముఖ్యమైందని అన్నారు. జెడ్పీ సీఈఓ నోంగ్‌జోయ్ మహ్మద్ అక్రమ్ అలీషా, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ డీటీ మంజునాథ్, కేపీఈసీ అసిస్టెంట్ అగ్రికల్చర్ డైరెక్టర్ చంద్రకుమార్, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నయీం పాషా, లీడ్ బ్యాంక్ మేనేజర్ కే.వీరేంద్రకుమార్, నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి విజయకుమార్, అసిస్టెంట్ అగ్రికల్చర్ డైరెక్టర్ మనోహర్‌గౌడ, హగరి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డైరెక్టర్ శిల్పా తదితరులు పాల్గొన్నారు.