
గడువులోగా పనులు పూర్తి చేయండి
సాక్షి, బళ్లారి: నిర్ణీత గడువులో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి రహీంఖాన్ పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయంలో అధికారుల సమక్షంలో ప్రగతి పరిశీలన సమావేశం నిర్వహించారు. నగరంలో వివిధ అభివృద్ధి పనుల కోసం నాలుగో దశలో రూ.65 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ఇందులో రూ.31 కోట్లు ఖర్చు కాగా మిగిలిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసి నగరాభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు. కాంట్రాక్టర్లతో ఎప్పటికప్పుడు అధికారులు సమావేశం నిర్వహించుకొని వారికి దిశానిర్ధేశం చేయాలన్నారు. నగరంలో మంజూరైన 104 అభివృద్ధి పనుల్లో 48 ప్రగతిలో ఉన్నాయని, మిగిలిన పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. టెండర్ ప్రక్రియ చూసుకొని సంబంధిత కాంట్రాక్టర్లతో చర్చించాలన్నారు. కాంట్రాక్టర్లను కార్యాలయం చుట్టూ తిప్పుకోకూడదన్నారు. జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ మహానగర పాలికె పరిధిలో అభివృద్ధి పనులతో పాటు మంచినీటి పనులకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.