
దర్శన్, పవిత్ర మళ్లీ జైలుకు
న్యూస్‌రీల్
తీర్పునకు ముందు
పవిత్ర పోస్టు..
నిందితురాలు పవిత్రాగౌడ సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందే సత్యం అన్నింటికంటే శక్తిశాలి, న్యాయం అందిస్తుందని పవిత్రాగౌడ పోస్ట్‌పెట్టారు. ఈ ప్రపంచంలో అన్నింటి కంటే అధిక శక్తి సత్యానికి ఉంటుంది. ఎంత సమయం తీసుకున్నప్పటికీ న్యాయం ఎప్పుడూ తన దారి చూపుతుందని ప్రస్తావించారు. ఆమె తీర్పు అనుకూలంగా వస్తుందని ఊహించి ఈ పోస్టు పెట్టారని భావిస్తున్నారు.
హైకోర్టు ఇచ్చిన బెయిలును
రద్దు చేసిన సుప్రీంకోర్టు
రాష్ట్ర ప్రభుత్వ పోరాట ఫలితం
ఆగమేఘాలపై నిందితుల అరెస్టు, పరప్పనకు తరలింపు
టాప్ హీరోని వీడని రేణుకాస్వామి హత్య కేసు
బనశంకరి: క్రైం థ్రిల్లర్ సినిమాలను మించిన మలుపులు ప్రముఖ నటుడు దర్శన్ జీవితంలో జరుగుతున్నాయి. చిత్రదుర్గవాసి రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్ తూగుదీప, ఆయన ప్రియురాలు, నటి పవిత్రగౌడ, తదితర 15 మంది నిందితులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వారి బెయిలు రద్దు కావడంతో మళ్లీ చెరసాల దర్శనం ఎదురైంది.
గురువారం ఏం జరిగింది?
దర్శన్ టీంకి హైకోర్టు ఇచ్చిన బెయిలును సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు.
నటుడు దర్శన్ ను బెంగళూరులో హొసకెరెహళ్లి వద్ద సతీమణి విజయలక్ష్మీ నివాసం ఉండే ప్రెస్టీజ్ సౌత్‌రిడ్జ్ అపార్టుమెంట్‌లో గురువారం సాయంత్రం 4 గంటలప్పుడు కామాక్షిపాళ్య, బసవేశ్వరనగర పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు మఫ్టీలో గాలిస్తూ అపార్టుమెంటు వద్దకు వచ్చారు.
అపార్టుమెంట్ వద్ద ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోగా, గొడవలు జరగకుండా దర్శన్‌ను పోలీసులు తీసుకెళ్లారు.
దర్శన్‌ను అన్నపూర్ణేశ్వరినగర పోలీస్‌స్టేషన్ కు తీసుకెళ్లారు. దర్శన్ తో పాటు 7 మందిని నిర్బంధించారు. దర్శన్ ఆప్తుడు ఏ 14 ప్రదోశ్, ఏ11 నాగరాజు, కారుడ్రైవరు ఏ12 లక్ష్మణ ఉన్నారు.
ఏ1 నిందితురాలు పవిత్రాగౌడను ఆర్‌ఆర్ నగరలోని ఆమె ఇంటిలో అరెస్ట్ చేశారు.
తరువాత సాయంత్రం వారిని జడ్జి నివాసంలో ప్రవేశపెట్టగా, ఆ మేరకు ఆదేశాలతో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు.
ఈ కేసులో పోలీసులు సుమారు 4 వేల పేజీలతో చార్జిషీటును ఇదివరకే సమర్పించారు.
కొడగు టూర్‌లో ఉన్న దర్శన్ సుప్రీం తీర్పు వినగానే బెంగళూరుకు వచ్చేశాడని తెలిసింది.
అందరూ సమానమే: రమ్యా పోస్ట్
బెయిల్ రద్దుకాగానే నటి రమ్యా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చట్టం ముందు అందరూ సమానం అనే స్పష్టమైన సందేశం వచ్చింది. మన పని మనం చేయాలి. చివరిలో ఆశ, వెలుగు ఉంటుంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదు, న్యాయం అందరికీ లభిస్తుంది అని రేణుకాస్వామి కుటుంబానికి మద్దతుగా పేర్కొన్నారు.
రేణుకాస్వామి హత్య కేసు వివరాలు...
2024 జూన్ 8న చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి బెంగళూరులో పట్టణగెరెలోని ఓ షెడ్డులో హత్య
2024 జూన్ 11న హత్య ఆరోపణలపై దర్శన్, పవిత్రగౌడ, ఇతరులు అరెస్ట్
దర్శన్ స్నేహితురాలు పవిత్రా గౌడకు రేణుకాస్వామి అశ్లీల మెసేజ్‌లు పంపించడం వల్ల ఆమె ప్రోద్బలంతో దర్శన్, అనుచరులు హత్య చేసినట్లు ఆరోపణ
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు నిందితుల తరలింపు
ఆ జైల్‌లో దర్శన్ కు రాచమర్యాదలు కల్పించినట్లు ఆరోపణలు. అక్కడి నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు దర్శన్ తరలింపు
వెన్నునొప్పి కారణంతో గతేడాది అక్టోబరు 30 నుంచి 6 వారాల పాటు మధ్యంతర బెయిల్
డిసెంబరులో దర్శన్ తో పాటు ఇతర నిందితులకు హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు
ఈ తీర్పును ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది

దర్శన్, పవిత్ర మళ్లీ జైలుకు

దర్శన్, పవిత్ర మళ్లీ జైలుకు