
పుణ్యక్షేత్రాలకు మసి పూయొద్దు
బనశంకరి: రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసిన ధర్మస్థలలో మృతదేహాల కోసం తవ్వకాల కేసులో గురువారం విధానసభ దద్దరిల్లింది. ధర్మస్థల మీద అసత్య ప్రచారం చేస్తున్న ప్రభుత్వం కూకటి వేళ్లతో కూలిపోతుందని బీజేపీ, జేడీఎస్ నాయకులు శాపాలు పెట్టారు. 69వ నిబంధన కింద చర్చ సాగింది. బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి 10, 15 ఏళ్ల క్రితం ధర్మస్థల లో వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని చెప్పడం ద్వారా పవిత్ర ధర్మక్షేత్రానికి చెడ్డపేరు తెచ్చేవిధంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అస్థికల కోసం తవ్వకాలంటూ హిందూ ధార్మిక కేంద్రాలపై జరుగుతున్న అసత్య ప్రచారం సహించడం సాధ్యం కాదన్నారు.
ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్త వహించాలని, ప్రజలు ఆవేశం చెంది పోరాటం చేసే స్థితి తీసుకురాకూడదన్నారు. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇది దర్యాప్తా, హిందూ పుణ్యక్షేత్రంపై జరుగుతున్న కుట్రలో అసత్య ప్రచారంలో కాంగ్రెస్ యూట్యూబర్లు, ఇతర మతస్తుల చేతిలో కీలుబొమ్మగా మారుతోందా అని ధ్వజమెత్తారు. సిట్ దర్యాప్తు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ధర్మస్థలను టార్గెట్ చేయడం సరికాదన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మాటలు విని గుంతలు తవ్వే పనిచేస్తున్నారని, ధర్మస్థల పవిత్రతను కాపాడటానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్ని రోజులు ఎన్ని గుంతలు తవ్వారు, ఎన్ని అస్థిపంజరాలు దొరికాయి అనేది చెప్పాలని సునీల్‌కుమార్ డిమాండ్ చేశారు. 15–16 గుంతలు తవ్వినప్పటికీ ఏమీ లభించలేదని తెలిసింది. ప్రభుత్వం దీనికి ముగింపు పలకాలని కోరారు. మరికొందరు ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వాన్ని తప్పుపడుతూ మాట్లాడారు.
మంజునాథుని భక్తున్ని: డీసీఎం
నేను ఇప్పటికీ ధర్మస్థల మంజునాథస్వామి భక్తున్ని, భక్తునికి– దేవునికి ఉన్న సంబంధానికి మనం భంగం కలిగించరాదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ధర్మస్థల వీరేంద్రహెగ్డే చేసిన సేవలను గౌరవిస్తామని చెప్పారు.
దర్యాప్తు జరుగుతోంది: హోంమంత్రి
హోంమంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ అందిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, ఆ ప్రాంత ప్రజల డిమాండ్ మేరకు జూన్ 19 సిట్ ను ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించామని తెలిపారు. ఇది పూర్తి కావడానికి కాలపరిమితి ఉంటుందని, సిట్ కు సభలో ఇబ్బందికలిగేలా చర్చ జరపవద్దని సూచించారు.
ధర్మస్థలలో తవ్వకాలంటూ
అసత్య ప్రచారం
మీ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది
విధానసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల ధ్వజం

పుణ్యక్షేత్రాలకు మసి పూయొద్దు

పుణ్యక్షేత్రాలకు మసి పూయొద్దు