
బస్టాండులో నగల చోరీ
మైసూరు: బస్సు ఎక్కేటప్పుడు ఓ మహిళ వ్యానిటీ బ్యాగ్‌లోని రూ.5 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను దొంగలు దోచేశారు. ఈ ఘటన మైసూరు సిటీలోని గ్రామీణ బస్టాండ్‌లో జరిగింది. నగరంలోని అగ్రహార నివాసి ఎస్‌జీ వీణా 7న సాయంత్రం సాలిగ్రామలోని తమ పుట్టినింటికని బయల్దేరింది. వరమహాలక్ష్మి పండుగ రోజున పూజ చేసేందుకు 90 గ్రాముల బంగారు నగలను బాక్సులో పెట్టి వ్యానిటీ బ్యాగ్‌లో ఉంచింది. రూరల్ బస్టాండ్‌లో రద్దీ తోపులాటలో అలాగే బస్సు ఎక్కింది. తర్వాత బ్యాగ్ చూడగా దాని జిప్ తెరిచి ఉంది, నగల పెట్టె కనబడలేదు. బాధితురాలు వెంటనే లష్కర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పోలీసులకు మెడల్స్
బనశంకరి: రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి ఎస్.బదరీనాథ్ రాష్ట్రపతి పతకానికి ఎంపికయ్యారు. పోలీస్‌శాఖలో ఉత్తమ సేవలు అందించినందుకు ఆయనతో పాటు మొత్తం 20 మంది వివిధ మెడల్స్‌కు ఎంపికయ్యారు. ఇందులో ముగ్గురు ఫైర్ సిబ్బంది ఉన్నారు. వీరిలో ఎస్పీ నుంచి పోలీసు కానిస్టేబుల్ వరకూ ఉన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా అవార్డులను ప్రకటించారు.
చెరసాలలో ప్రజ్వల్ దిగులు
యశవంతపుర: ధనవంత కుటుంబీకునిగా, పార్లమెంటు సభ్యునిగా సకల రాజభోగాలను అనుభవించిన హెచ్‌డీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసులో బెంగళూరు పరప్పన జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. ఆ బాధతో అతడు తీవ్ర మనోవ్యాకులతకు గురైనట్లు తెలిసింది. కారాగారంలో ఎవరితోను మాట్లాడటం లేదు. సరిగా తిండి తినడం లేదు. దీంతో రెండు రోజులకు ఒక్కసారి వైద్యులు ఆయనకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ శిక్షే ఫైనల్ కాదు, ఇంకా హైకోర్టు, సుప్రీంకోర్టులున్నాయి. పెరోల్ వచ్చి విడుదల కావచ్చు అని ఊరడించే మాటలు చెబుతున్నారు. బీటెక్ చదివిన ప్రజ్వల్ జైల్లో ఏదైనా సాంకేతిక విభాగంలో పనిచేయాలని వైద్యులు సూచించారు. వ్యవసాయం, లైబ్రరీ నిర్వహణ, బేకరీ, గార్మెంట్స్ పని, జైలు ఫైళ్ల శాఖలో పని చేయడం తదితరాలను సూచించారు. పనిలో మునిగిపోతే బాధను మరిచిపోయి హుషారుగా ఉండవచ్చని తెలిపారు.
జాడ లేని ఎమ్మెల్యే సతీష్
యశవంతపుర: అక్రమ గనులు, ఆస్తుల కేసులో కార్వార కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ సైల్ ఇంటిపై బుధవారం ఈడీ అధికారులు దాడి చేసిన తరువాత ఆయన ఆచూకీ లేదు. మొబైల్ ఫోన్ స్విచాఫ్ అయి ఎవరికీ అందుబాటులో లేరు. ఈడీ అధికారులు ఇంటిలో సోదాలు చేసి అనేక రికార్డులను సీజ్ చేశారు. ఆయన అజ్ఞాత స్థలంలో ఉన్నట్లు తెలిసింది. ఈడీ అధికారులు కూడా ఆయన కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. గురువారం మధ్యాహ్నం వరకు సోదాలు సాగాయి.
నకిలీ పసిడితో టోకరా
శివమొగ్గ: ఓ వ్యక్తికి నకిలీ బంగారం ఇచ్చి లక్షలాది రూపాయల మేర వంచించిన ఇద్దరిని భద్రావతి తాలూకా హొళెహొన్నూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. డీఎస్పీ నాగరాజ్ మార్గదర్శనంలో ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్, ఎస్‌ఐ రమేష్ గాలింపు జరిపి శివమొగ్గ తాలూకా హాడోనహళ్లి గ్రామ నివాసి యల్లప్ప(48), కరిబసప్ప(48)లను అరెస్టు చేసి వారి నుంచి రూ.5.05 లక్షల నగదును స్వాధీనపరచుకున్నారు. నిందితులు బెళగావి జిల్లా రాయభాగ తాలూకా ముగళఖోడకు చెందిన మారుతీ భీమ్‌శ్రీ అనే డ్రైవర్‌కు కాల్‌చేసి తమ వద్ద బంగారం ఉందని, తక్కువ ధరకే ఇస్తామని చెప్పారు. దీంతో మారుతికి ఆశ పుట్టింది. వారిని కలవగా లక్షలాది రూపాయలను తీసుకుని నకిలీ బంగారాన్ని ముట్టజెప్పి పరారయ్యారు. బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు విచారణ చేపట్టారు.