
ధర్మస్థలలో మరిన్ని చోట్ల తవ్వకాలు
యశవంతపుర: ధర్మస్థలలో మృతదేహాలను పాతిపెట్టారనే కేసులో ఫిర్యాదుదారు (ముసుగు మనిషి) ఎస్‌ఐటీ అధికారులకు మరో జాగాను చూపించాడు. ధర్మస్థల కన్యాడి సమీపంలో కొత్త ప్రదేశాన్ని చూపడంతో అక్కడ గురువారం తవ్వకం చేపట్టారు. నేత్రావతి నది పక్కలోని ప్రైవేట్ వ్యక్తుల వక్క తోటలో ఈ ప్రదేశముంది. మరో పక్క అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పాతి పెట్టినట్లు ముసుగుమనిషి చెప్పగా, అక్కడా గాలింపు జరుగుతోంది. పుత్తూరు సబ్ కలెక్టర్ సైల్లా వర్గీస్, సిట్ ఎస్పీ జితేంద్ర కుమార్ దయామ నేతృత్వంలో తవ్వకాలు నిర్వహించినా సాయంత్రం వరకు ఏమీ దొరకలేదు.
కీచక అధ్యాపకుడు
● 17 ఏళ్ల విద్యార్థినితో పరారీ
దొడ్డబళ్లాపురం: విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ అధ్యాపకుడు కీచకునిగా మారాడు. విద్యార్థినిని ప్రేమపేరుతో మభ్యపెట్టి కిడ్నాప్ చేసి తీసికెళ్లిన అతన్ని దొడ్డ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలోని కొంగాడియప్ప కళాశాలలో కన్నడ లెక్చరర్‌గా గత 15 ఏళ్లుగా పనిచేస్తున్న ప్రవీణ్ (45) నిందితుడు. ప్రవీణ్‌కి 10 ఏళ్ల క్రితం పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో భార్య పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరోవైపు కాలేజీలోనే చదివే విద్యార్థినితో (17) ప్రేమాయణం సాగించిన ప్రవీణ్ ఆమెను 2వ తేదీన తీసికెళ్లిపోయాడు. ఢిల్లీలో కొన్ని రోజులు ఉండి తరువాత నంజనగూడుకు వచ్చారు. విద్యార్థిని తల్లిదండ్రులు, ప్రవీణ్ భార్య ఫిర్యాదుల మేరకు పోలీసులు గాలించి ప్రవీణ్‌ని అరెస్టు చేశారు. పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.