
వారికి శిక్ష పడాల్సిందే
● రేణుకాస్వామి భార్య సహన
బనశంకరి: ఎవరు తప్పు చేసినా వారికి శిక్ష పడాలని, చట్ట ప్రకారం జరగాలని హత్యకు గురైన రేణుకాస్వామి భార్య సహన డిమాండ్ చేశారు. నటుడు దర్శన్ తో పాటు 7 మందికి సుప్రీంకోర్టు బెయిల్‌ను రద్దు చేయడం గురించి చిత్రదుర్గలో తన ఇంట్లో సహన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. రేణుకాస్వామి చిన్నాన్న షడక్షరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కోర్టు త్వరితగతిన విచారణ చేపట్టి తీర్పు ఇచ్చింది, వారి బెయిలును రద్దు చేయడం హర్షణీయమన్నారు.
న్యాయం దక్కింది: తల్లి
తమ కుమారుని హత్య కేసులో న్యాయం లభించిందని, చట్టం పై నమ్మకం ఉందని రేణుకాస్వామి తల్లి రత్నమాల అన్నారు. గురువారం తీర్పు వస్తుందని తమకు తెలియదని, మంచి తీర్పు వచ్చిందని, కుమారుని ఆత్మకు శాంతి లభించాలని ఆమె చెప్పారు. ఇంటిదేవునికి అభి షేకం చేయడానికి వెళుతున్నామన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుద్వారా నిందితులకు తగిన గుణపాఠం జరిగింది. రేణుకాస్వామి భార్య సహన పిన్న వయస్కురాలు, ఆమెకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని తల్లి డిమాండ్ చేశారు.