
అధ్వానంగా ఏపీఎంసీ మార్కెట్
సాక్షి,బళ్లారి: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉండేందుకు మనం తీసుకునే ఆహారం కూడా దోహదపడుతుంది. ఆహారంలో ప్రతి నిత్యం ప్రతి ఒక్కరూ కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాంటి కూరగాయలు అమ్మే మార్కెట్ అధ్వానంగా ఉండటమే కాకుండా బురదయమంగా మారుతోంది. నగరంలో ఏపీఎంసీ మార్కెట్ అంటే బళ్లారి నగర ప్రజలందరికీ కూరగాయాలు అందించే పెద్ద మార్కెట్టే కాదు, ఇతర ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి కూరగాయలు తీసుకెళ్లి అమ్మకాలు సాగిస్తుంటారు. ఏపీఎంసీకి బళ్లారితో పాటు పొరుగున ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి రైతులు తాము పండించిన కూరగాయలను ఇక్కడికి తీసుకుని వచ్చి అమ్మకాలు సాగిస్తుంటారు. ప్రతి నిత్యం తెల్లవారు జామున 4 గంటల్లోపు పెద్ద ఎత్తున వాహనాల్లో కూరగాయలు, ఆకుకూరలు తెచ్చి ఇక్కడ అమ్ముతుంటారు. రైతులు నేరుగా ఇక్కడ దళారులకు కూరగాయల అమ్మకాలు చేస్తుంటారు.
చినుకు పడితే చిత్తడే..
పెద్ద కూరగాయల మార్కెట్‌గా పేరొందిన బళ్లారి ఏపీఎంసీ వర్షం వస్తే చిత్తడిగా తయారవుతోంది. అందులో పందులు, పశువులు కూడా తిరుగుతుండటంతో ఆ బురదలోనే కూరగాయలను, ఆకుకూరలను అమ్ముతుండటంతో గత్యంతరం లేక వాటినే జనం కొనుగోలు చేస్తున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా వారం రోజులకు పైగా బురదలోనే కూరగాయల అమ్మకాలు చేస్తుంటారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి భారీ వర్షాలు అప్పుడప్పుడూ పడుతూనే ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడల్లా బురదలోనే వ్యాపారులు కూరగాయల అమ్మకాలు చేస్తుండటం సర్వసాధారణం. ప్రస్తుతం నాలుగు రోజుల నుంచి వర్షం కురుస్తుండటంతో షరా మామూలుగానే ఏపీఎంసీ బురదమయంగా మారిపోయింది. ఆ బురదలోనే కూరగాయల అమ్మకాలు చేస్తుండటంతో చిన్న చిన్న వ్యాపారులు ఉదయాన్నే ఏపీఎంసీకి వెళ్లి బురదలోనే కూరగాయలు కొనుగోలు చేసుకుంటున్నారు.
అభివృద్ధిపై మీనమేషాలు..
ఏపీఎంసీ అధ్వానంగా ఉందని పాలకులకు, అధికారులకు కళ్లకు కట్టినట్లు తెలిసినా అభివృద్ధి చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని రైతులు, వ్యాపారులు, వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎంసీ మార్కెట్‌లో వర్షం వస్తే వారం రోజులకు పైగా బురదలో కూరగాయల అమ్మకాలు చేస్తుండటంతో స్థానికులు పాలకుల తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఏపీఎంసీ మార్కెట్‌లో నిత్యం పెద్ద ఎత్తున కూరగాయల అమ్మకాలు జరుగుతుంటాయి. ఇతర ప్రాంతాల నుంచి రైతులు, వ్యాపారులు నేరుగా ఏపీఎంసీకి తీసుకు వచ్చి ఇక్కడ వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నారు. రైతులతో హోల్‌సేల్‌గా కొనుగోలు చేసిన వాటిని రీటైల్‌గా ఇక్కడ వ్యాపారాలు చేస్తుంటారు. రైతులు, వ్యాపారుల నుంచి నగరంలోని చిరు వ్యాపారులు, హోటల్ యజమానులు ఏపీఎంసీకి వచ్చి కొనుగోలు చేయడం పరిపాటి. అయితే వర్షం కారణంగా ఏపీఎంసీ బురదమయంగా మారడంతో బురదలోనే కూరగాయల అమ్మకాలు చేస్తుండటంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నగర వాసులు శాపనార్థాలు..
ఏపీఎంసీలో ఒక్క కూరగాయల అమ్మకాలతో పాటు నిత్యావసర వస్తువులు కూడా ఇక్కడ వ్యాపారాలు చేస్తుంటారు. దీంతో ఏపీఎంసీకి ప్రతి నిత్యం వేలాది మంది జనం వచ్చి ఎవరికి కావాల్సిన వాటిని వారు కొనుగోలు చేసుకుంటున్నారు. పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల అమ్మకాలకు పెట్టింది పేరుగా నిలిచిన ఏపీఎంసీ అస్తవ్యస్తంగా మారడంతో బురదలోనే కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని నగర వాసులు వాపోతున్నారు. ఏపీఎంసీ మార్కెట్‌తో పాటు వర్షం వస్తే నగరంలో నిత్యం అధిక జన సంచారం కలిగిన కార్యాలయాలు బురదగా మారడంతో జనం బురదలో ద్విచక్ర వాహనాలు, కాలినడకన వెళుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీఎంసీతో పాటు పలు రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల ఆవరణలు కూడా బురదమయంగా మారుతున్నా సంబంధిత అధికారులు, పాలకులు ముందు చూపుతో గట్టి చర్యలు చేపట్టకపోవడంపై నగర వాసులు శాపనార్థాలు పెడుతున్నారు.
వర్షం వస్తే బురదమయంగా
మారుతున్న వైనం
రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల
ఆవరణలు కూడా

అధ్వానంగా ఏపీఎంసీ మార్కెట్