
శివాజీనగర: ధర్మస్థలలో బుధవారం 13వ పాయింట్‌లో తవ్వకాలు సాగాయి. అక్కడికి పాండురంగ, తుకారాంగౌడ అనే ఇద్దరు వచ్చారు. 2009లో శవాలను పూడ్చిపెట్టినది చూశాం. సహాయవాణికి, సిట్‌కు ఫిర్యాదు చేశాం. అయితే శవాన్ని పూడ్చింది ఈ ముసుగుమనిషి కాదు, అతనిని తాము చూడనే లేదు అని చెప్పారు.
హోంమంత్రితో సిట్ చీఫ్ భేటీ
ధర్మస్థల కేసులో సిట్ చీఫ్ ప్రణవ్ మొహంతి హోం మంత్రి పరమేశ్వర్‌ను భేటీ చేశారు. విధానసౌధలో కలిసి అర్ధ గంటకు పై చర్చలు జరిపారు. కేసు సమాచారం గురించి చర్చించారు.
పుణ్యక్షేత్రం మీద అపనిందలా?
ధర్మస్థలపై దు్రష్పచారం తగదు
పలు నగరాలలో భక్తుల ర్యాలీలు
శివాజీనగర: ధర్మస్థలకు విరుద్ధంగా అపప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ భక్తులు, హిందూ సంఘాల కార్యకర్తలు బుధవారం రాష్ట్రంలో ధర్నాలు చేశారు. మైసూరు, బెళగావి, చిక్కమగళూరు, చామరాజనగర, గదగ, కల్బుర్గి, తుమకూరులో నిరసనలు జరిగాయి. ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే మీద తప్పుడు ప్రచారం సాగుతోందన్నారు. పురాణ ప్రసిద్ధ క్షేత్రమైన ధర్మస్థల ప్రతిష్టకు భంగం కలిగించే దూషణలు, అవమానకర పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నారు? వారికి ఆర్థిక సహాయం ఇస్తున్నవారు ఎవరనేది తనిఖీ చేయాలన్నారు.
నిరసనలు, ధర్నాలు
బెళగావిలో చిన్నమ్మ సర్కిల్ నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు పాదయాత్ర జరిపి, జిల్లాధికారికి వినతి పత్రాన్ని సమరి్పంచారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చెబితే తవ్వకాలు జరుగుతున్నాయి. ఎవరో వచ్చి విధానసౌధలో నిధి ఉందంటే తవ్వుతారా? అని భక్తులు ప్రశ్నించారు. చిక్కమగళూరులో 2 వేల మందికి పైగా భక్తులు ఆజాద్ పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. మైసూరులో వేలాదిమంది ర్యాలీ చేసి ధర్నా నిర్వహించారు.